భూదాన్ భూములపై ‘బ్లాక్‌మార్క్’
ఖమ్మంలో ఆక్రమణల దండయాత్ర
నగరం–గ్రామం అన్న తేడా కూడా లేదు
మండలాల వారీగా ముదురుతున్న వివాదాలు
రికార్డు గందరగోళంతో రైతుల బతుకులు బేజారు
కోర్టుల చుట్టూ తిరుగుతున్న వేలాది కుటుంబాలు
ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజల డిమాండ్
లేదంటే ఖమ్మం జిల్లాలో పెద్ద సామాజిక–న్యాయ సంక్షోభంగా మారే అవకాశం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లాలో భూదాన్ ఉద్యమం ద్వారా పేదలకు కేటాయించిన భూములు నేడు అక్రమ ఆక్రమణలు, రికార్డు లోపాలు, కోర్టు కేసులతో చిక్కుముడిలో పడ్డాయి. నగర ప్రాంతాల నుంచి గ్రామీణ మండలాల వరకూ భూదాన్ భూములపై వివాదాలు రోజురోజుకీ ముదురుతున్నాయి. ఒకవైపు నివాసాలు, కమర్షియల్ షెడ్స్ వెలుస్తుండగా.. మరోవైపు సాగు చేస్తున్న రైతులు తమ భూమి తమదేనా? అన్న సందేహంలో బతుకులీడుస్తున్నారు. రికార్డుల్లో భూదాన్ బోర్డు పేరు అలాగే ఉండిపోవడం, పాత లబ్ధిదారుల పేర్లు అప్డేట్ కాకపోవడం వల్ల రైతులు రుణాలు, ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ సమస్య తీవ్రత భిన్నంగా ఉన్నా, దాదాపు అన్ని మండలాల్లోనూ భూదాన్ భూముల వివాదాలు పెరుగుతూనే ఉన్నాయి.

నగర పరిధిలోనే.. రెడ్ అలర్ట్
ఖమ్మం అర్బన్ మండలంలో భూదాన్ భూములపై అక్రమ ఆక్రమణలు అత్యధికంగా నమోదవుతున్నాయి. రోడ్లు, నాలాల పక్కన ఉన్న భూములపై నివాసాలు, వాణిజ్య షెడ్లు నిర్మించడంతో వివాదాలు చెలరేగాయి. ఈ భూములపై కోర్టు కేసులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉండటంతో సమస్య తీవ్రత అత్యధికంగా మారింది. ఖమ్మం రూరల్ మండలంలో సాగు సాగుతున్నా పహాణీలో ఇంకా భూదాన్ బోర్డు పేరు ఉండటం రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. బ్యాంకు రుణాలు, రైతు పథకాలు అందకపోవడంతో సమస్య తీవ్రతగా ఉంది. చింతకాని మండలంలో భూదాన్ భూములపై దీర్ఘకాలిక వివాదాలు కొనసాగుతుండగా, ఆక్రమణలపై ఫిర్యాదులకు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలతో రైతు సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఇక్కడ సమస్య తీవ్రత అత్యంత ఎక్కువగా ఉంది.
సరిహద్దుల గందరగోళం.. సర్వే లేమి
ముదిగొండ మండలంలో భూదాన్ భూములు పక్క భూములతో కలిసిపోవడం, సరిహద్దులు స్పష్టంగా లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. సర్వే జరగకపోవడంతో రైతుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. కొణిజర్ల మండలంలో రికార్డుల మధ్య విభేదాలు, అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణలతో లబ్ధిదారులకు పూర్తి హక్కులు దక్కడం లేదు. నేలకొండపల్లి మండలంలో ఖాళీగా ఉన్న భూదాన్ భూములపై గుడిసెలు వేసి, ఆపై శాశ్వత నిర్మాణాలు చేపట్టడంతో సమస్యగా మారింది. వైరా, తల్లాడ మండలాల్లో సాగులో ఉన్నా యాజమాన్య స్పష్టత లేక రైతులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. సత్తుపల్లి మండలంలో రియల్ ఎస్టేట్ ఒత్తిడితో భూదాన్ భూములపై లేఅవుట్లు వెలుస్తుండగా, కేసులు పెరుగుతున్నాయి. పెనుబల్లి మండలంలో భూదాన్–ప్రభుత్వ భూముల వర్గీకరణలో తప్పులు రైతులకు నష్టంగా మారుతున్నాయి. జిల్లా మొత్తంగా ఒకే విధమైన విధానం లేకపోవడం, టైమ్‌బౌండ్ సర్వే జరగకపోవడం, అక్రమ ఆక్రమణల తొలగింపులో ఆలస్యం వంటి అంశాలు సమస్యను మరింత జటిలంగా మారుస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చర్యలు తీసుకోకపోతే భూదాన్ భూముల సమస్య ఖమ్మం జిల్లాలో పెద్ద సామాజిక–న్యాయ సంక్షోభంగా మారే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.


