రామా కనవేమిరా…!
అంబ సత్రం భూములన్ని హాంఫట్
ఆలయ భూముల్లో అడ్డుగోలు వ్యాపారం
5000 ఎకరాల్లో యథేచ్ఛగా సాగు
అనుభవించడమే కానీ హక్కు లేదంటున్న దేవాదాయ శాఖ
శిస్తు వసూళ్లతో సరిపెట్టుకుంటున్న దేవస్థానం అధికారులు
అనిశెట్టిపల్లి ,సీతారాంపురం రైతులు పట్టాల కోసం ఎదురుచూపు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : అక్షరాలా అవి ఆలయ భూములు. తెలంగాణ రాష్ట్రానికే మణిహారంగా నిలిచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన అంబసత్రం భూములు. కానీ నేడు అవి అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారాయి. వందల ఏళ్లుగా సాగు చేసుకుంటూ బతుకుతున్న రైతులకు హక్కులు లేవు.. మరోవైపు కొందరు మాత్రం దర్జాగా దోచుకుంటున్నారు. దేవస్థానం, దేవదాయ శాఖ మాత్రం శిస్తు వసూలుతో సరిపెట్టుకుంటూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని అనిశెట్టిపల్లి, సీతారాంపురం గ్రామాల్లో భద్రాచలం పుణ్యక్షేత్రానికి సంబంధించిన అంబసత్రం భూములు వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. శృంగేరి జగద్గురు మహాసంస్థ పమిడి గంట వెంకటరమణ హరిదాసు నిత్య అన్నదాన సత్రానికి సంబంధించిన ఈ దేవుడు మాన్యం భూములు నేడు అక్రమ దందాలకు కేంద్రంగా మారాయి.

ఆలయ భూముల్లో అడ్డగోలు వ్యాపారం
అనిశెట్టిపల్లి ప్రాంతంలో అంబసత్రం భూములపై కొందరు ఇటుక బట్టీలు ఏర్పాటు చేసి లక్షల రూపాయలు గడిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా మట్టిని తోడేస్తూ ఆలయ భూములను దోచేస్తున్నారు. సీతారాంపురం ప్రాంతంలో అధికంగా గిరిజన రైతులు సాగు చేస్తున్నప్పటికీ, సుమారు 2,500 ఎకరాల దేవుడు మాన్యం భూములపై అక్రమ క్రయవిక్రయాలు సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘దేవుడు మాన్యం’ అన్న పేరు ఉండగానే కొందరు యథేచ్ఛగా వ్యాపారాలు చేస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత దేవస్థానం, దేవదాయ శాఖ భూ పరిరక్షణ ఎందుకు చేపట్టడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆలయ భూములను కాపాడాల్సిన అధికారులే నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన వ్యవస్థే మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. అనిశెట్టిపల్లి పంచాయతీ పరిధిలోని అంబసత్రం భూముల్లో ఉన్న బొడ్డు పుల్ల చెరువు శిఖం కూడా కబ్జాదారుల చేతుల్లో చిక్కుకుంది. రాత్రి వేళల్లో మట్టితవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. జగ్గుతండ, కూనారం, మాలపల్లి, మాదిగప్రోలు తదితర గ్రామాల వాగుల్లో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నా దేవదాయ శాఖ స్పందించకపోవడంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
కేవలం శిస్తు వసూళ్లకే పరిమితమా?
అంబసత్రం భూములపై జరుగుతున్న అక్రమాల మధ్యలో దేవస్థానం అధికారులు కేవలం శిస్తు వసూలుకే పరిమితమవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. శిస్తుగా ఎంత వసూలవుతోంది? అది ఎంత మేరకు దేవస్థానం ఖజానాకు చేరుతోంది? అన్న దానిపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో నిధులు దారి మళ్లుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనిశెట్టిపల్లి, సీతారాంపురం గ్రామాల్లోని అంబసత్రం భూములను అనుభవిస్తున్న రైతులకు ఇప్పటివరకు ఎలాంటి హక్కులు కల్పించలేదు. ఫలితంగా రైతుబంధు, పంట బీమా వంటి ప్రభుత్వ ప్రయోజనాలు ఒక్కటీ వారికి అందడం లేదు. పహాణీల్లో అనుభవదారులుగా రైతుల పేర్లు ఉన్నా, పట్టాదారు కాలమ్‌లో సీతమ్మ తల్లి పేరు ఉండటం గమనార్హం. ఇప్పుడు ఈ భూములను దేవస్థానం స్వాధీనం చేసుకుంటే, వాటిపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన, గిరిజనేతర రైతుల కుటుంబాల పరిస్థితి ఏమవుతుందన్న ఆందోళన నెలకొంది. అంబసత్రం ఆలయ భూములను పరిరక్షించాలా? రైతులకు హక్కులు కల్పించాలా? లేక శతాబ్దాలుగా సాగు చేస్తున్న కుటుంబాలను అనాథలుగా మార్చాలా? అన్న ప్రశ్నలు ఇప్పుడు కొత్తగూడెం రూరల్ ప్రాంతంలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ప్రభుత్వం, దేవదాయ శాఖ తక్షణమే స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఈ అంశం పెద్ద సామాజిక–న్యాయ సమస్యగా మారే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.


