సిట్ దూకుడు
సీఎం సోదరుడు, మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు
నేడు హాజరుకావాలని ఆదేశాలు
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఉన్నప్పుడు కొండల్ రెడ్డి ఫోన్ ట్యాప్ !
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తండ్రి కొండలరావుకు కూడా..
త్వరలోనే మరో చార్జిషీట్ దాఖలు చేసేందుకు రెడీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
తాజాగా హరీష్‌రావుకు సుప్రీం కోర్టులో ఊరట
ఇంకా ఎన్నాళ్లు సాగదీస్తారని ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్న
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. దర్యాప్తు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ముఖ్య నేతలు తెరపైకి వస్తున్నారు. ఇప్పటి వరకు పోలీస్ అధికారులు, ప్రైవేట్ వ్యక్తుల చుట్టే తిరిగిన దర్యాప్తు, తాజాగా ప్రజాప్రతినిధుల వైపు మళ్లింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ కేసును వేగంగా దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డితోపాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్‌యాదవ్‌కు నోటీసులు జారీ అయినట్లు సమాచారం. వీరంతా గురువారం ఉదయం హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కొండల్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొందరికి కూడా సిట్ నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ నేతలకు నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణలో సిట్ దూకుడు పెంచింది. తాజాగా విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తండ్రి కొండలరావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. అతనితో పాటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావుకు సైతం నోటీసులు జారీ చేసింది. బుధవారం విచారణకు హాజరు కావల్సి ఉండగా నవీన్ రావు తండ్రి కొండలరావు గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణాల దృష్ట్యా తన నివాసంలోనే విచారణకు సిద్ధమని సిట్ అధికారులకు తెలిపారు. ఎమ్మెల్యే మాధవరం కుమారుడు సందీప్ రావు విదేశాల్లో ఉన్నట్లు సిట్‌కి తెలిపినట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరో ఇద్దరు బీఆర్‌ఎస్ నేతలకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలకు నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. త్వరలో మరో చార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును జనవరి 4న సిట్ సుదీర్ఘంగా ప్రశ్నించింది. గులాబీ పార్టీ పెద్దలతో ఉన్న ఆర్థిక సంబంధాలపైనా ఆరా తీసింది. దాదాపు 9 గంటల పాటు సాగిన విచారణలో గతంలో బీఆర్ఎస్ పార్టీకి సమకూరిన ఎలక్టోరల్ బాండ్ల అంశంపైనా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

హరీష్‌రావుకు ఊరట
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీం కోర్టులో ఇటీవల ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్పీని సుప్రీం ధర్మాసనం రెండు రోజుల కింద డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో తెలంగాణ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అయితే గతంలోనే తన ఫోన్‌ను ట్యాప్ చేయించారంటూ మాజీ మంత్రి హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయ్యింది. దీన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. సరైన ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం సుప్రీంలో విచారణ జరుగగా.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం తేల్చిచెప్పింది. ఎస్‌ఎల్పీలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.
కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లా సిట్..
ఫోన్ ట్యాపింగ్ కేసును ఇంకా ఎన్నాళ్లు సాగదీస్తారని ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించారు. ఎంతమందిని పిలిచి విచారణ చేసినా వేళ్లన్ని ఒకవైపే చూపిస్తున్నాయని, వేళ్లన్ని ఒకరివైపే చూపినా ఆయన జోలికి వెళ్లటం లేదని అన్నారు. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేస్తారా అని స్వయంగా కుమార్తె ప్రశ్నించిందని తెలిపారు. సిట్ కాస్తా కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లాగా అయిపోయిందని విమర్శించారు. 650 మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయని సర్వీస్ ప్రొవైడర్లే చెప్పారని అన్నారు. కుటుంబంలో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటామని, బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు భారమైందిఆ పార్టీతో ఉపయోగం లేదని రఘునందన్‌రావు ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులకే నచ్చటం లేదని, కాంగ్రెస్ పార్టీపై ప్రజలు నమ్మకం కోల్పోయారని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే అని ధీమా వ్యక్తం చేశారు.


