వల్లకాడును వదలరే!
మట్టెవాడలో శ్మశాన వాటికలో కబ్జాపర్వం
ఇంటి నిర్మాణానికి అనుమతిచ్చిన జీడబ్ల్యూఎంసీ అధికారులు
డిప్యూటీ చైర్మన్ బండా, ఎమ్మెల్సీ బస్వరాజు లేఖలతో వెలుగులోకి
వరంగల్ బల్దియాలో అక్రమాలకు నిలువెత్తు నిదర్శనం
కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగరంలో ప్రభుత్వ భూముల కబ్జాపర్వానికి అడ్డుకట్ట లేకుండా పోతోంది. ప్రభుత్వ స్థలాలు, రహదారులు, మురికి కాల్వలు, నాలాలు, చెరువు శిఖం భూములు మాత్రమే కాదు… చివరకు శ్మశానవాటికలను కూడా కబ్జాదారులు వదలడం లేదు. ఈ అక్రమాలకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, రెవెన్యూ శాఖ, వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) అధికారులే అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు బలపడుతున్నాయి. ప్రతి సోమవారం జీడబ్ల్యూఎంసీ గ్రీవెన్స్ సెల్‌కు వస్తున్న ఫిర్యాదులే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. తాజాగా నగరంలో శ్మశానవాటిక కబ్జాకు గురికావడం… అధికారుల విధుల నిర్వహణలో నిబద్ధతకు నిలువెత్తు ప్రశ్నగా మారింది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలు వేర్వేరుగా బల్దియా కమిషనర్‌కు రాసిన లేఖలతో ఈ కబ్జా బండారం వెలుగులోకి వచ్చింది.

వల్లకాడులో ఇంటికి అనుమతులా?
వరంగల్ మట్టెవాడ ప్రాంతం సర్వే నంబర్ 442లో శ్మశానవాటిక ఉన్నట్లు అధికారిక రికార్డులే చెబుతున్నాయి. ఈ భూమిలో సుమారు 13 గుంటల స్థలాన్ని తొలుత కబ్జా చేసినట్లు సమాచారం. నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తయారు చేసిన గుత్తికొండ తిరుపతి… ఆ స్థలాన్ని కరీంనగర్‌కు చెందిన ఏ. దామోదర్, శారద దంపతులకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దామోదర్ ఇటీవల ఆ స్థలంలో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. బల్దియా అధికారులపై నమ్మకం కోల్పోయిన స్థానికులు… చివరకు డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలను ఆశ్రయించారు. వారు వెంటనే స్పందించి శ్మశానవాటికలో జరుగుతున్న నిర్మాణాలను నిలిపివేసి తగు చర్యలు తీసుకోవాలంటూ జీడబ్ల్యూఎంసీ కమిషనర్, వరంగల్ తహసీల్దార్‌కు లేఖలు రాశారు.
అధికారులనే అదరగొట్టిన కబ్జాదారులు!
ప్రజాప్రతినిధుల లేఖలతో బల్దియా కమిషనర్, తహసీల్దార్ అప్రమత్తమయ్యారు. తక్షణమే జీడబ్ల్యూఎంసీ టౌన్‌ప్లానింగ్, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, రెవెన్యూ శాఖ ఆర్‌ఐలను సంఘటన స్థలానికి పంపించారు. అయితే ఇంటి నిర్మాణదారుడు అధికారులనే అదరగొట్టినట్లు సమాచారం. తన వద్ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయని, జీడబ్ల్యూఎంసీ అధికారులు స్వయంగా పరిశీలించి ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని వాదిస్తూ అధికారులను హడలెత్తించినట్లు తెలుస్తోంది. చివరకు ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయని, సర్వే పూర్తయ్యే వరకు పనులు నిలిపివేయాలని చెప్పి టౌన్‌ప్లానింగ్ అధికారులు వెనక్కి తగ్గాల్సి వచ్చిన పరిస్థితి. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువు శిఖం భూముల పరిరక్షణకు అధికారులు తీసుకుంటున్న చర్యలకు ఇది మరో నిలువెత్తు సాక్ష్యంగా మారింది. శ్మశానవాటిక కబ్జా బాగోతం ఇక ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.


