ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలపాలి
8వ తేదీ వరకు గడువు
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
కాకతీయ, హనుమకొండ : పరకాల మున్సిపాలిటీ పరిధిలో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, సలహాలు లేదా సూచనలు ఉంటే ఈ నెల 8వ తేదీలోగా తెలియజేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మున్సిపల్ ఓటర్ల జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 1వ తేదీన పరకాల మున్సిపాలిటీ పరిధిలో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శించామని తెలిపారు. జాబితాలో తప్పులు, లోపాలు లేదా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువు లోపల అందజేయాలని, తద్వారా సకాలంలో సవరణలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రవి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, పరకాల మున్సిపల్ కమిషనర్ అంజయ్య, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ.వి.శ్రీనివాసరావు, రావు అమరేందర్ రెడ్డి, శనిగరపు రాజు, జి.ప్రభాకర్ రెడ్డి, కుసుమ శ్యాంసుందర్, సయ్యద్ ఫైజుల్లా, నాగబెల్లి రజనీకాంత్, శ్రీనివాస్, వీరేష్ రావు, వెంకటస్వామి, నిరంజన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.


