కాకతీయ, నేషనల్ డెస్క్: ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ అరాచకాలు ఎక్కువయ్యాయి. దీన్ని అరికట్టేందుకు ఆన్ లైన్ గేమింగ్ బిల్లును తీసుకువచ్చేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ సిద్ధమయ్యింది. ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ కేంద్రం హోంమంత్రి అమిత్ షాకు లేఖను రాసింది.
ఆన్ లైన్ బెట్టింగ్స్ ను అరికట్టేందుకు కేంద్రం తీసుకువచ్చే బిల్లు కారణంగా తమ రంగానికి తీవ్ర నష్టం కలుగుతుందంటూ ఏఐజీఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది అమల్లోకి వస్తే తమ పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లుతుందని కోట్లాదిమంది చట్టబద్ధమైన గేమర్స్ గా అక్రమంగా నెట్ వర్క్ లను నడిపేవారి వైపు వెళ్లేలా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు ఈ రంగంలోని అనేక మంది ఉద్యోగులపై కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందని హెచ్చరించింది. ఈ సందర్భంగా దీన్ని పూర్తిగా నిషేధించనట్లయితే దానిపై నియంత్రణ చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. ఆటగాళ్లను రక్షించడంతోపాటు వారి బాధ్యతాయుతంగా ఆడేలా చర్యలు తీసుకోవాలంటూ కోరింది. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించాలని పరిశ్రమను పూర్తిగా చీకట్లోకి తోసివేయద్దని అభ్యర్థించింది.
ఈ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ వాడకం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. దీనికి బానిసైన కొందరు అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. వీటిని ప్రమోట్ చేసిన ప్రముఖులు కూడా దర్యాప్తు సంస్థల నుంచి విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆన్ లైన్ బెట్టింగ్ ను నేరుగా పరిగణిస్తూ..ఆన్ లైన్ గేమింగ్ బిల్లును తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.


