కొండగట్టు చుట్టూ రాజకీయం
ఆలయ అభివృద్ధిపై రాజుకుంటున్న రాజకీయ వేఢీ
ఎమ్మెల్యే సత్యం, మాజీ ఎమ్మెల్యే సుంకరి మధ్య సవాళ్లు
గత ప్రభుత్వంలో అభివృద్ధే లేదన్న సత్యం
లెక్కలతో సహ నిరూపించేందుకు సిద్ధమంటున్న సుంకరి
పొలిటికల్ క్రెడిట్‌పై వాగ్యుద్ధం
గుడి అభివృద్ధిపై స్పష్టమైన కార్యాచరణ కావాలంటున్న భక్తులు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ఇన్నాళ్లు భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఇప్పుడు రాజకీయ వేడికి కేంద్రంగా మారింది. ఆలయ అభివృద్ధి పేరుతో గతంలో ఇచ్చిన హామీలపై మొదలైన చర్చ క్రమంగా నేతల నిబద్ధతను ప్రశ్నించే బహిరంగ రాజకీయ సమరంగా మారింది. చొప్పదండి నియోజకవర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య రాజీనామా సవాళ్ల వరకూ వెళ్లిన ఈ వివాదం జిల్లా రాజకీయాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. గత బీఆర్ఎస్ పాలనలో కొండగట్టు అభివృద్ధికి భారీ హామీలు ఇచ్చారని, కానీ అవి మాటలకే పరిమితమయ్యాయని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. హామీలే తప్ప నిధుల జాడ ఎక్కడా కనిపించలేదని ఆయన ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా జిల్లా రాజకీయాలను వేడెక్కించాయి.
కొండగట్టు అభివృద్ధికి గత ప్రభుత్వం ఒక్క రూపాయి అయినా ఖర్చు చేసినట్టు ఆధారాలు చూపిస్తే ఎమ్మెల్యే పదవినే కాదు రాజకీయ జీవితాన్నే వదిలేస్తానంటూ ఎమ్మెల్యే సత్యం సంచలన సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. కొండగట్టు పేరు చెప్పుకుని రాజకీయాలు చేశారే తప్ప అభివృద్ధి జరగలేదన్న ఆరోపణలతో ఆయన దూకుడు పెంచారు.
మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ప్రతిసవాల్
ఎమ్మెల్యే సత్యం సవాల్‌కు కౌంటర్‌గా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రంగంలోకి దిగారు. మాటల యుద్ధాన్ని మరింత ఉద్ధృతం చేస్తూ ‘సమయం, తేదీ చెప్పు.. బీఆర్ఎస్ పాలనలో కొండగట్టుకు వచ్చిన ప్రతి పైసా లెక్కలతో బహిరంగంగా చూపిస్తా’ అంటూ ప్రతిసవాల్ విసిరారు. కొండగట్టు వై జంక్షన్‌ను సాక్షిగా చేసుకుని నిధుల వివరాలు బయటపెడతానని ప్రకటించారు. నిధులు వచ్చినట్టు తేలితే ఎమ్మెల్యే సత్యం తన మాట నిలబెట్టుకుని పదవికి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో ఈ వివాదం మాటల యుద్ధం నుంచి ప్రతిష్ఠ సమరంగా మారింది.
పవన్ చొరవ.. పెరిగిన రాజకీయ వేఢీ..!
ఇదిలా ఉండగా కొండగట్టు అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన నిధులు రాజకీయ చర్చకు మరో మలుపు ఇచ్చాయి. బయట రాష్ట్రం నుంచి సహాయం వస్తుంటే తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటివరకు ఏం చేశాయన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. గిరి ప్రదక్షిణ వంటి మౌలిక సదుపాయాలకైనా ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి రావడం పాలనా నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇన్నాళ్లు ఆధ్యాత్మిక ప్రశాంతతకు నిలయమైన అంజన్న కొండ ఇప్పుడు బీఆర్ఎస్–కాంగ్రెస్ రాజకీయ సమరానికి వేదికగా మారింది. ఒక వర్గం ‘ఒక్క రూపాయి రాలేదు’ అంటుంటే మరో వర్గం ‘ప్రతి పైసా లెక్కలతో చూపిస్తాం’ అంటూ ప్రతిసవాళ్లు విసురుతోంది. కొండగట్టుకు నిజమైన శాశ్వత అభివృద్ధి ఎప్పుడు?
రాజకీయ లాభనష్టాలకన్నా ముందుగా భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన అంజన్న గుడి అభివృద్ధిపై స్పష్టమైన కార్యాచరణ కావాలని భక్తులు, ప్రజలు కోరుతున్నారు.


