“నువ్వెందిరా కేసీఆర్‌ను మొలకెత్తనిచ్చేది..?
తెలంగాణను మొలకెత్తించిన మొనగాడు కేసీఆర్
ఉద్యమాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు
కేసీఆర్‌పై దాడులు ఉద్యమంపైనే దాడులు
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు
కాకతీయ, జనగామ : “నువ్వెందిరా కేసీఆర్‌ను మొలకెత్తనిచ్చేది..?” అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్‌ను మొలకెత్తనిచ్చిన నేల తెలంగాణ అయితే, ఆ తెలంగాణను స్వరాష్ట్రంగా మొలకెత్తించిన మొనగాడు కేసీఆర్ అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ అనేది కేవలం ఒక వ్యక్తి కాదని, అది తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు.
జనగామ జిల్లా కేంద్రంలో మంగళవారం పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ గుర్తు చేశారు. లాఠీచార్జీలు, అరెస్టులు, కుట్రలు ఎదురైనా వెనక్కి తగ్గని మొండితనం వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. అలాంటి నాయకుడిని తక్కువ చేసి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని హెచ్చరించారు. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల స్వరమని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం అహర్నిశలు పోరాడిన నాయకుడని కేటీఆర్ తెలిపారు. ఉద్యమాన్ని పుట్టించిన నాయకుడిని ఇప్పుడు మొలకలతో పోల్చడం అవివేకమని విమర్శించారు. తెలంగాణను మొలకెత్తించిన నేలే కేసీఆర్‌ను నాయకుడిగా తీర్చిదిద్దిందన్నారు.
కాంగ్రెస్–బీజేపీలపై మండిపాటు
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేదని, అందుకే నేడు కేసీఆర్‌పై అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు కుమ్మక్కై తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను ఎంత దూషించినా ప్రజల గుండెల్లో ఆయన స్థానం చెక్కుచెదరదని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం సాగిన పోరాట చరిత్రను ఎవరూ మార్చలేరని, కేసీఆర్ నాయకత్వంలో మొదలైన ఉద్యమ స్ఫూర్తి ఇంకా కొనసాగుతుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్, బీజేపీలకు తగిన సమాధానం ప్రజాక్షేత్రంలోనే చెబుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


