రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన
కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో, కరీంనగర్ ట్రాఫిక్ పోలీసు అధికారుల సమన్వయంతో పట్టణంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులకు వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోడ్డు నియమాలు పాటించకపోతే ఎదురయ్యే చట్టపరమైన శిక్షలు గురించి వివరించారు. మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి అంగవైకల్యం లేదా మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. రోడ్డు నియమాలు అతిక్రమించి వాహనాలు నడిపి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరీముల్లా ఖాన్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేష్, ఎస్సై గణేష్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


