దేశ నిర్మాణంలో శిశు మందిర్‌ల పాత్ర గొప్పది
శిశు మందిర్ గురువులే నవభారత శిల్పులు
సంస్కారం–క్రమశిక్షణ–దేశభక్తికి పునాది
‘ఖేల్ ఖుద్’ క్రీడల ప్రారంభంలో బండి సంజయ్
శిశు మందిర్ విద్యే తన ఎదుగుదలకు కారణమంటూ గుర్తు చేసకున్న కేంద్ర మంత్రి
కాకతీయ, కరీంనగర్ : దేశ భవిష్యత్తు నిర్మాణంలో సరస్వతి శిశు మందిర్‌ల పాత్ర గొప్పదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నవ భారతాన్ని తీర్చిదిద్దే అసలైన శిల్పులు శిశు మందిర్ గురువులేనని కొనియాడారు. సంస్కారం, క్రమశిక్షణ, దేశభక్తి వంటి విలువలు శిశు మందిర్‌లోనే బలపడతాయని పేర్కొన్నారు. కరీంనగర్ నగరంలోని హౌజింగ్ బోర్డు కాలనీలోని సరస్వతి శిశు మందిర్‌లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘ఖేల్ ఖుద్’ క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. అఖండ జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించిన ఆయన, విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడి వారిలో ఉత్సాహం నింపారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఫోటోలు దిగారు.
విద్య కాదు.. విద్యా ఉద్యమం
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన బండి సంజయ్.. సరస్వతి శిశు మందిర్ అంటే కేవలం భవనం కాదని, హంగు అర్భాటాలకు పరిమితమైన విద్యాసంస్థ కాదని స్పష్టం చేశారు. ఇది దేశ భవిష్యత్తును మలిచే ఒక గొప్ప విద్యా ఉద్యమమని అన్నారు. ఇక్కడ చదువుతోపాటు సంస్కారాన్ని కూడా నేర్పుతారని, శిశు మందిర్‌లో చదవడం అదృష్టమని వ్యాఖ్యానించారు. కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల చదువు పూర్తిగా వ్యాపారంగా మారిందని బండి సంజయ్ విమర్శించారు. ర్యాంకులు, మార్కులు, ప్యాకేజీలు, విదేశీ అవకాశాలకే చదువు పరిమితమైందని అన్నారు. అయితే సరస్వతి శిశు మందిర్ మాత్రం లాభాల కోసం కాకుండా ఒక లక్ష్యం కోసం పనిచేస్తోందని చెప్పారు. ఉద్యోగార్థులను కాకుండా దేశ సేవకులను తయారు చేయడమే శిశు మందిర్ లక్ష్యమని స్పష్టం చేశారు. మార్కులు మనిషిని తయారు చేయవని, ర్యాంకులు విలువలను నేర్పవని, ప్యాకేజీలు దేశభక్తిని పెంచవని వ్యాఖ్యానించారు. భారతదేశానికి అవసరమైనది సంపూర్ణ మనిషిని తీర్చిదిద్దే విద్యేనని, అది సరస్వతి శిశు మందిర్‌లోనే లభిస్తుందని తెలిపారు. ఉదయం ప్రార్థన, వందేమాతరం, భారతమాత చిత్రానికి నమస్కారం వంటి కార్యక్రమాల ద్వారా పిల్లల రక్తంలోనే విలువలు నింపుతారని అన్నారు. రామాయణం, మహాభారతం, గీతా సారంతో పాటు గణితం, సైన్స్, టెక్నాలజీ విద్యను సమపాళ్లలో బోధిస్తారని వివరించారు. శిశు మందిర్ గురువులు జీతం చూసే ఉద్యోగులు కాదని, దేశ భవిష్యత్తును భుజాలపై మోసే సాధకులని బండి సంజయ్ కొనియాడారు. పెద్ద జీతాలు, ప్రకటనలు లేకపోయినా దేశాన్ని నిర్మించే గొప్ప బాధ్యతను నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. విద్యతో సంపాదన రావచ్చుగానీ, సంస్కారం లేకపోతే ఆ సంపాదన సమాజానికి భారమవుతుందని హెచ్చరించారు.
శిశు మందిర్‌లకు పక్కా భవనాలు..!
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలన్నింటికీ పక్కా భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. శిశు మందిర్‌లో చదువుతున్న 9వ, 10వ తరగతి విద్యార్థులందరికీ సైకిళ్లు అందిస్తామని, ల్యాప్‌టాప్‌లు సహా ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యా వ్యవస్థను కాంగ్రెస్ పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, యువతకు ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామని ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇచ్చిన ఆర్థిక సహాయం మాటలకే పరిమితమైందని, ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలతో విద్యార్థులు, విద్యాసంస్థలు ఇబ్బందులు పడుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా విద్యను బోధిస్తూ పిల్లల భవిష్యత్తు కోసం అంకితభావంతో పని చేస్తున్న సంస్థ సరస్వతి శిశు మందిర్ అని పేర్కొంటూ, తాను ఇదే పాఠశాలలో చదువుకుని ఈ స్థాయికి వచ్చానని గర్వంగా చెప్పగలనన్నారు. శిశు మందిర్‌లను ప్రజలు ఆదరించి ప్రోత్సహించాలని కోరారు.


