హుజూరాబాద్‌లో రేషన్ బియ్యం మాఫియా గుట్టు రట్టు
లవకుశ రైస్‌మిల్లులో అర్థరాత్రి దాడులు 290 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం
కాకతీయ, హుజురాబాద్ : హుజూరాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఉన్న లవకుశ రైస్‌మిల్లులో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సోమవారం అర్థరాత్రి హుజూరాబాద్ సీఐ టీ.కరుణాకర్ పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.లవకుశ రైస్‌మిల్లులో రేషన్ బియ్యం అక్రమంగా లోడింగ్ జరుగుతున్నట్లు నమ్మదగిన సమాచారం అందడంతో సీఐ కరుణాకర్ పోలీసు బృందంతో కలిసి అక్కడికి చేరుకున్నారు. పోలీసులు రావడాన్ని గమనించిన మిల్లులో పనిచేస్తున్న కూలీలు అక్కడి నుంచి పరారయ్యారు.

అనంతరం బియ్యంతో నిండిన లారీని పోలీసులు స్వాధీనం చేసుకుని హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై వెంటనే సివిల్ సప్లయిస్ శాఖ అధికారులకు సమాచారం అందించారు.ప్రభుత్వం పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఈ వ్యవహారంలో ఉన్న వ్యక్తులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.


