రోడ్లపై ఉన్న దుకాణాల తొలగింపు
మేడారంలో భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఎస్పీ చర్యలు
కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో రహదారులపై ఆక్రమణకు గురైన దుకాణాల తొలగింపునకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. సోమవారం రాత్రి ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., జిల్లా పోలీస్ అధికారి కేకన్ సుధీర్ రామనాథ్లు సమన్వయంతో స్వయంగా రంగంలోకి దిగారు. జాతర సమయంలో భారీ జనసందోహం ఏర్పడుతుందని, భక్తుల సురక్షిత రాకపోకలు, వాహనాల సాఫీగా నడిచేలా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు వ్యాపారులకు వివరించారు. రహదారి నుంచి కనీసం 12 అడుగుల దూరంలో తమ అసలు (నిర్దిష్ట) స్థానాలకు దుకాణాలను వెనక్కి మార్చాలని సూచించారు.
భక్తుల భద్రతకే చర్యలు
ఈ చర్యలు ఎలాంటి బలవంతం లేకుండా, సౌమ్యంగా, మర్యాదపూర్వకంగా చేపట్టామని అధికారులు స్పష్టం చేశారు. భక్తుల రాకపోకలకు ఆటంకం కలగకుండా, అత్యవసర సేవలు నిరాటంకంగా కొనసాగేందుకు రహదారి విస్తరణ అవసరమని తెలిపారు. అధికారుల సూచనలను వ్యాపారులు అర్థం చేసుకుని పూర్తి స్థాయిలో సహకరించడంతో రహదారి విస్తరణ సక్రమంగా పూర్తయ్యింది. దీంతో జాతర మార్గంలో రాకపోకలు మరింత సుగమంగా మారాయి. ఈ సందర్భంగా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ స్థానిక పోలీస్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. రహదారి మళ్లీ ఆక్రమణకు గురికాకుండా నిరంతర తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ, ఓఎస్డీ, ఆర్డీఓతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మేడారం జాతరను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోందని అధికారులు స్పష్టం చేశారు.


