కాకతీయ ఎఫెక్ట్..
ఇసుక దందాపై ఉక్కుపాదం
అక్రమాలపై నేరుగా రంగంలోకి దిగిన కలెక్టర్, పోలీస్ కమిషనర్
ఇసుక క్వారీలు, చెక్‌పోస్టులపై ఆకస్మిక తనిఖీలు
క్వారీల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు
అక్రమాలు తేలితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : జిల్లాలో ఇసుక ర్యాంపులు, ఇసుక రవాణాలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. ఇసుక అక్రమాలపై కాకతీయ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమవడంతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం స్వయంగా రంగంలోకి దిగారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఇసుక రీచ్‌ల నిర్వహణ, రవాణా జరగాలంటూ కఠిన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం రాత్రి వీణవంక మండలం చల్లూరు గ్రామంలోని టీజీఎండీసీ ఇసుక క్వారీని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్వారీ వద్ద వేయింగ్ బ్రిడ్జ్ పనితీరును పరిశీలించి, ఇసుక లారీల లోడింగ్ బరువును స్వయంగా చెక్ చేశారు. వే బిల్లులు, డీడీలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి లారీకి లోడింగ్‌కు ముందు, తర్వాత తప్పనిసరిగా వేయిట్ చేయాలని, ఎంట్రీ–ఎగ్జిట్ వివరాలను సాండ్ ఆడిట్ యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

నిబంధనలు కచ్చితంగా పాటించాలి
ఇసుక లోడింగ్ సమయంలో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని టీజీఎండీసీ సిబ్బందికి స్పష్టం చేశారు. రికార్డులు, వే బిల్లులు, డీడీల్లో ఏ చిన్న తేడా ఉన్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. డీడీలు చెల్లించిన మేరకే లోడింగ్ జరగాలని, అక్రమాలకు పాల్పడితే వెంటనే కేసులు నమోదు చేస్తామని తేల్చిచెప్పారు. క్వారీ ప్రాంగణంలోని కీలక ప్రాంతాల్లో, లోడింగ్ పాయింట్లు, వేయింగ్ బ్రిడ్జ్, లారీ వివరాల నమోదు గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైన కంప్యూటర్లు, పరికరాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని సూచించారు. లారీ డ్రైవర్లు తప్పనిసరిగా టార్పాలిన్ కవర్లు వినియోగించాలని, రోడ్డుపై ఇసుక పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

చెక్‌పోస్టులపైనా నజర్
వీణవంక మండలం మామిడాలపల్లి, మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామాల్లోని ఇసుక చెక్‌పోస్టులను పరిశీలించి ప్రతి లారీకి సంబంధించిన వే బిల్లులు, డీడీలను జాగ్రత్తగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్వారీ సిబ్బంది, లారీ డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా, అక్రమ నిల్వలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం స్పష్టం చేశారు. ఇసుక ర్యాంపులు, చెక్‌పోస్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఈ తనిఖీల్లో ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, హుజురాబాద్ ఏసీపీ మాధవి, వీణవంక–మానకొండూరు తహసీల్దార్లు అనుపమ, విజయ్, టీజీఎండీసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ వినయ్ కుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.


