యువతను గుడుంబా వ్యసనం నుంచి రక్షించాలి
తక్షణమే అరికట్టాలంటూ రాయపర్తి సర్పంచ్‌కు వినతి
కాకతీయ, రాయపర్తి : రాయపర్తి గ్రామంలో గుడుంబా అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతుండటంపై యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గుడుంబా వ్యసనానికి యువకులు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఈ వ్యసనం కారణంగా అనారోగ్యానికి గురై భర్తలను కోల్పోయిన మహిళలు రోడ్డున పడుతున్నారని యువత ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామ సర్పంచ్ సహింద్ర బిక్షపతి, పంచాయతీ కార్యదర్శి వల్లే వినోద్ కుమార్‌కు యువత వినతిపత్రం అందజేశారు. గ్రామంలో గుడుంబా అమ్మకాలను తక్షణమే అరికట్టాలని, యువతను ఈ వ్యసనం నుంచి రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గుడుంబా అమ్మకాలను పూర్తిగా అరికట్టే వరకు తమ పోరాటం ఆపమని యువత స్పష్టం చేయడంతో ఈ అంశం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.


