నకిలీ వైద్యుల గుట్టురట్టు
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లు
ఆకస్మిక తనిఖీల్లో బయటపడ్డ నిజాలు
కాకతీయ,వరంగల్ సిటీ : నగరంలోని కాశిబుగ్గ ప్రాంతంలో ఇద్దరు నకిలీ వైద్యుల సెంటర్స్ పై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డా వి.నరేష్ కుమార్, జిల్లా ఆంటీ క్వాకరీ కమిటీ సభ్యుడు డా వి. రాకేష్ సోమవారం సాయంత్ర సమయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో తిలక్ నగర్ ప్రాంతానికి చెందిన మామిడి ఈశ్వరయ్య వాస్తవానికి ఎల్.ఐ.సి ఏజెంట్ పనిచేస్తూ, తాను డాక్టర్ అని పోస్టర్లు పెట్టుకొని జిల్లా ఆర్.ఎం.పి అసోసియేషన్ అధ్యక్షుడునని, 40సంవత్సరాలుగా వైద్యం చేస్తున్నానని చెప్పుకుంటూ రోగులను మోసం చేస్తున్నాడు. ఈ నకిలీ డాక్టర్ చట్ట విరుద్ధంగా త్రివేణి క్లినిక్ నడుపుతూ హాస్పిటల్ వలె బెడ్ ఏర్పాటు చేసి, యథేచ్ఛగా ఎటువంటి వ్యాధి నిర్ధారణ చేయకుండా హైడోస్ ఆంటీ బయోటిక్, మలేరియా ఇంజెక్షన్స్ మందులు రోగులకు ఇస్తూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాడని కౌన్సిల్ సభ్యులు తెలిపారు. అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి ఎస్కే నయీమ్, ఎక్స్‌రే టెక్నీషియన్ చదివి, హిజమా కప్పింగ్ థెరపీ పేరుతో అర్హత, అనుమతి లేని డిగ్రీలు పెట్టుకొని, బెడ్స్ ఏర్పాటు చేసి సెలైన్ లు పెట్టడం, ఆశాస్త్రియ పద్ధతులలో హైడోస్ స్టేరోయిడ్స్, ఆంటీ బయోటిక్ ఇంజెక్షన్స్ రోగులకు ఇస్తున్నాడని తనిఖీకి వచ్చిన కౌన్సిల్ సభ్యులు గుర్తించారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఈ నకిలీ వైద్యులపై ఎన్ఎంసీ యాక్ట్, తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశామని ఇన్స్పెక్షన్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా. వి. నరేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుకు గురిచేస్తున్న నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు తప్పనిసరిగా నమోదైన అర్హత కలిగిన వైద్యులను మాత్రమే సంప్రదించాలని సూచించారు. అనుమానాస్పదమైన నకిలీ వైద్యుల సమాచారం 9154382727కి వాట్సాప్ లేదా antiquackerytsmc@onlinetsmc.in మెయిల్ అందిస్తే కౌన్సిల్ తగు చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు.


