గ్రామపంచాయతీల్లో మోదీ ఫొటో తప్పనిసరి
కార్యాలయాల్లో ప్రధాని ఫొటో లేకపోవడం అన్యాయం
బీజేపీ మండల అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్
ఎంపిడీఓ కార్యాలయంలో వినతిపత్రం
కాకతీయ, నల్లబెల్లి : నల్లబెల్లి మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ మండల, జిల్లా నాయకులతో కలిసి స్థానిక ఎంపిడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఆబిద్ అలీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ గౌడ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని గుర్తు చేశారు. ముఖ్యంగా 14వ, 15వ ఆర్థిక సంఘాల ద్వారా గ్రామస్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధికి కోట్లాది రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. గ్రామ సచివాలయాలు, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వసతులు వంటి అనేక అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులతోనే అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటో మాత్రమే ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వ పాత్రను విస్మరించడం తగదని విమర్శించారు.
సమాన గౌరవం ఇవ్వాలి
గ్రామపంచాయతీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటోతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను కూడా ఏర్పాటు చేయడం ద్వారా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని ప్రజలకు స్పష్టంగా చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది రాజకీయ అంశం కాదని, అభివృద్ధికి నిధులు అందిస్తున్న కేంద్రానికి ఇవ్వాల్సిన కనీస గౌరవమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల, జిల్లా స్థాయి నాయకులు పాల్గొని వినతిపత్రానికి మద్దతు తెలిపారు. ప్రధాని ఫొటో ఏర్పాటు అంశంపై అధికారులు సానుకూలంగా స్పందించాలని బీజేపీ నేతలు కోరారు.


