16 చర్చిల నిర్మాణానికి నిధులు
మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు
క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ డా. ఒనిస్ మాస్
కాకతీయ, ములుగు ప్రతినిధి : ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటివరకు సరైన ప్రార్థన మందిరాలు, చర్చిలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రైస్తవుల సమస్యలను గుర్తించి, వారి అభివృద్ధికి సహకరించిన రాష్ట్ర మంత్రి సీతక్కకు ములుగు జిల్లా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో, జిల్లా వ్యాప్తంగా ప్రార్థన మందిరాల అభివృద్ధికి రూ.72 లక్షలు కేటాయించినందుకు మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ డాక్టర్ ఒనిస్ మాస్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ప్రజా ప్రభుత్వం క్రైస్తవుల ప్రత్యేక అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. ములుగు జిల్లాలోని క్రైస్తవుల అవసరాలను పరిగణనలోకి తీసుకొని మొత్తం 16 చర్చిల నిర్మాణానికి రూ.72 లక్షల నిధులు కేటాయించడం హర్షణీయమని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అన్ని ప్రొసీడింగ్స్‌ను ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిందని తెలిపారు. ఈ అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా, మంత్రి దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకునేలా సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో క్రైస్తవులకు కూడా సముచిత స్థానం కల్పిస్తూ, అన్ని వర్గాలను ప్రోత్సహించే విధానాన్ని అమలు చేస్తున్నందుకు మంత్రి సీతక్కకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.


