ప్రయాణికుల సహనానికి పరీక్ష
నత్త నడకన ములుగు బస్టాండ్ పనులు
కాంట్రాక్టర్ అలసత్వం… అధికారుల నిర్లక్ష్యం
ఎనిమిది నెలలైనా బేస్‌మెంట్ దశే
రోడ్లపైనే బస్సుల కోసం ప్రయాణికుల నిరీక్షణ
మంత్రి సీతక్క అసహనం… 12లోగా పూర్తి చేయాలని ఆదేశాలు
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ములుగు నూతన బస్టాండ్ నిర్మాణ పనులు నత్త నడకన సాగుతుండటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లా ఏర్పాటైన తర్వాత ఆధునిక హంగులతో బస్టాండ్ నిర్మించాలని పలుమార్లు డిమాండ్ చేయగా, స్పందించిన రాష్ట్ర మంత్రి సీతక్క సుమారు రూ.2 కోట్ల 70 లక్షల నిధులతో పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే ఎనిమిది నెలలు గడిచినా పనులు ఇంకా బేస్‌మెంట్ దశ దాటకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాకే ప్రతీకగా నిలవాల్సిన బస్టాండ్, ప్రస్తుతం ప్రయాణికుల కష్టాలకు చిహ్నంగా మారిందన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
రోడ్లపైనే ప్రయాణికుల అవస్థలు…
బస్టాండ్ నిర్మాణం పేరుతో పాత బస్టాండ్‌ను మూసివేయడంతో, ప్రయాణికులు జాతీయ రహదారి పక్కనే బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. బస్సులు ఎక్కడ ఆగుతాయో స్పష్టత లేక అయోమయం నెలకొంది. ఎండలో రోడ్డు పక్కనే నిలబడాల్సి రావడం, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, కూర్చునే సదుపాయాలు, మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రయాణం నరకప్రాయంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. బస్టాండ్ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనుల స్థలంలో రోజూ చూసినా కేవలం కొద్దిమంది కార్మికులు మాత్రమే కనిపిస్తున్నారని, నెలలు గడిచినా నిర్మాణంలో గణనీయమైన పురోగతి లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే పనులు సాగుతున్నాయే తప్ప పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి కనిపించడం లేదని విమర్శిస్తున్నారు.

కుంటి సాకులతో తప్పించుకుంటున్న అధికారులు
బస్టాండ్ నిర్మాణాన్ని పర్యవేక్షించాల్సిన సంబంధిత శాఖాధికారులు కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనులు ఎప్పుడు పూర్తవుతాయని ప్రజలు ప్రశ్నిస్తే, నిధుల సమస్య, టెక్నికల్ ఇష్యూలు అంటూ సాకులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తమవుతోంది. ఇప్పటికీ ఖచ్చితమైన గడువును ప్రకటించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల మేడారం జాతర పనుల పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో, ములుగు జిల్లా కేంద్రంలోని నూతన బస్టాండ్ నిర్మాణంపై మంత్రి సీతక్క తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. పనుల పురోగతిపై సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ నెల 12లోగా బస్టాండ్‌లోకి ప్రయాణికులు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా పనులు వేగవంతం చేసి ప్రయాణికుల కష్టాలకు ముగింపు పలకాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.


