కవిత రాజీనామా ఆమోదానికి అడ్డెవరు..?
ఎమ్మెల్సీ పదవికి నాలుగు నెలల క్రితమే రాజీనామా
చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఫార్మెట్‌లో లేఖ
ప్రతిపక్ష ఎమ్మెల్సీ విషయంలో మౌనం ఎందుకు?
కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టేందుకేనా ఈ ఆలస్యం?
కవితకు సపోర్ట్ చేస్తున్నట్లుగా సంకేతమా?
తాజా సభలో భావోద్వేగ ప్రసంగం వెనుక వ్యూహం?
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో కవిత రాజీనామా వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్సీ పదవికి ఆమె నాలుగు నెలల క్రితమే రాజీనామా చేసినప్పటికీ, ఇప్పటివరకు ఆమోదం పొందకపోవడం అనేక ప్రశ్నలకు దారి తీస్తోంది. ముఖ్యంగా ఈ రాజీనామాను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి స్వయంగా ఫార్మెట్‌లో సమర్పించినప్పటికీ, ఎందుకు పెండింగ్‌లో ఉంచారన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రాజీనామాల విషయంలో చైర్మన్‌కు విచక్షణాధికారాలు ఉంటాయి. కానీ అవి కూడా నిబంధనల పరిధిలోనే. సందేహాలు ఉంటే సభ్యుడిని పిలిపించి వివరణ కోరవచ్చు. అలాంటిదేమీ జరగకుండానే నాలుగు నెలల పాటు మౌనం పాటించడం సహజమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రతిపక్ష ఎమ్మెల్సీ కాబట్టేనా ఈ వైఖరి?
ఇక్కడ కీలక అంశం—కవిత అధికార పార్టీ ఎమ్మెల్సీ కాదు. ప్రధాన ప్రతిపక్షానికి చెందిన నాయకుడి కుమార్తె. అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే అవి రాజకీయ సమన్వయాలతో మేనేజ్ అవడం సాధారణమే. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్సీ విషయంలో ఇదే తీరుగా వ్యవహరించడం రాజకీయ ఉద్దేశాలతోనేనా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఆలస్యం వెనుక కేసీఆర్‌ను రాజకీయంగా ఇరకాటంలో పెట్టాలన్న వ్యూహముందా? లేక కవితను సపోర్ట్ చేస్తున్నట్లుగా సంకేతం ఇవ్వాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంలో చూపుతున్న విచిత్రమైన వైఖరి మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
ఇందుకోసమే ఇన్నాళ్లు ఆగారా?
తాజాగా శాసనమండలిలో కవిత చేసిన భావోద్వేగ ప్రసంగం ఈ చర్చలకు మరింత ఆజ్యం పోసింది. “ఇదే చివరి సారి సభలో మాట్లాడుతున్నా” అన్న వ్యాఖ్యలు, గులాబీ పార్టీని ఇరకాటంలో నెట్టేలా చేసిన వ్యాఖ్యానాలు… ఇవన్నీ ముందస్తు రాజకీయ వ్యూహంలో భాగమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకేనా ఇన్నాళ్లూ రాజీనామా ఆమోదాన్ని ఆపి ఉంచారు? సభా వేదికగా ఆమెకు పూర్తి స్థాయిలో మాట్లాడే అవకాశం ఇచ్చేందుకే ఈ ఆలస్యం జరిగిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో వ్యూహాలు సాధారణమే అయినా, సంవిధానబద్ధమైన పదవుల్లో ఉన్నవారు నిబంధనలకు అతీతంగా వ్యవహరించారా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. మొత్తానికి కవిత రాజీనామా కంటే… ఆ రాజీనామా చుట్టూ కొనసాగుతున్న మౌనం, ఆలస్యం, రాజకీయ సంకేతాలే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నాయి.


