రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం
ముందస్తుగా యూరియా టోకెన్ల పంపిణీ
కార్పొరేటర్ ఉమా దామోదర్ యాదవ్
కాకతీయ, ఖిలావరంగల్ : తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతోందని స్థానిక కార్పొరేటర్ ఉమా దామోదర్ యాదవ్ తెలిపారు. ఆదివారం అరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూడు కోటల పరిధిలోని రైతులకు ముందస్తుగా యూరియా బస్తాల కూపన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉమా దామోదర్ యాదవ్ మాట్లాడుతూ… యాసంగి పంట వేసిన రైతులకు యూరియా కొరత రాకుండా పంటల అవసరాలకు అనుగుణంగా ముందుగానే టోకెన్లు అందిస్తున్నామని తెలిపారు. రైతులు సకాలంలో ఎరువులు పొందేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. రైతుల డిమాండ్ మేరకు అవసరమైనన్ని యూరియా బస్తాలను తెప్పించి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ పనులు నిలిచిపోకుండా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తోందన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం నిరంతరం పని చేస్తోందని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి విజ్ఞాన్, వనపర్తి కర్ణాకర్‌తో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.


