అయ్యప్ప శరణు ఘోషలతో మార్మోగిన గణపురం
రామాలయంలో ఇరుముడి మహోత్సవం
కాకతీయ, గణపురం : గణపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయం ఆదివారం భక్తి పారవశ్యంతో దివ్య క్షేత్రంలా మారింది. ఆలయ ప్రాంగణమంతా “స్వామియే శరణమయ్యప్ప” నినాదాలతో మార్మోగగా, అయ్యప్ప స్వాములకు ఇరుముడి కట్టే కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. వరంగల్‌లోని అయ్యప్ప స్వామి హరీహర క్షేత్రం నుంచి విచ్చేసిన గురుస్వామి కర్ణాకర్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది అయ్యప్ప స్వాములు శాస్త్రోక్తంగా ఇరుముడి కట్టించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు పుష్పజల్లులు కురిపిస్తూ స్వాములపై భక్తి ప్రదర్శించారు. ఆలయం పూర్ణకుంభాలు, దీపాల అలంకరణలతో కళకళలాడింది. రామాలయంలో అయ్యప్ప గీతాలు, నామస్మరణలతో భక్తులు పరవశించారు. ఇరుముడి కట్టే క్షణాలను దర్శించేందుకు గ్రామస్తులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గణపురం గ్రామానికి చెందిన అయ్యప్ప స్వాములు భక్తి భావంతో శబరిమల యాత్రను ప్రారంభించారు. స్వాములకు వారి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పుష్పాలతో ఘనంగా సాగనంపారు. సాయంత్రం శబరిమలై పథంలో స్వాములు బయల్దేరగానే గణపురం వీధులు “అయ్యప్ప శరణు” నినాదాలతో మార్మోగిపోయాయి. ఈ పుణ్యక్షణాన్ని దర్శించిన గ్రామ ప్రజలు స్వాముల యాత్ర నిర్విఘ్నంగా, విజయవంతంగా సాగాలని హృదయపూర్వకంగా ఆకాంక్షించారు.


