అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ
వెనుజులా సంపదపై కన్నేసిన ట్రంప్
ఎంసీపీఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
అమెరికన్ పెత్తందారితనానికి నిరసనగా వరంగల్‌లో ర్యాలీ
కాకతీయ, వరంగల్ సిటీ : స్వతంత్ర దేశమైన వెనుజులాపై అమెరికా అత్యంత పాశవికంగా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను బంధించి న్యూయార్క్‌కు తరలించడం దారుణమని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలను ప్రపంచ శాంతి కోరుకునే ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఎంసిపిఐ(యు) నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం వెనుజులాపై అమెరికా నియంతృత్వ దాడిని ఖండిస్తూ పార్టీ కార్యాలయం నుంచి హెడ్‌పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వెనుజులా ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తూ నినాదాలు చేశారు.
సంపద కోసం దేశాలపై దాడులు
గాదగోని రవి మాట్లాడుతూ, లాటిన్ అమెరికా దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు అమెరికా నియంతృత్వ పద్ధతుల్లో దాడులు చేస్తూ ఆయా దేశాల సహజ సంపదను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వెనుజులాలో లభించే చమురు, బంగారం వంటి వనరులపై కన్నేసి అకస్మాత్తుగా దాడి చేయడం ప్రజాస్వామ్యానికి, ప్రపంచ శాంతికి తీవ్ర ముప్పు అని అన్నారు. సోషలిస్టు భావాలతో సమానత్వం, స్వేచ్ఛ మార్గంలో వెనుజులా అభివృద్ధి చెందుతోందని, భారతదేశానికి కూడా సుమారు 10 శాతం చమురు సరఫరా చేస్తోందని గుర్తు చేశారు. అలాంటి దేశంపై ట్రంప్ కుటిల నీతితో దాడి చేయడం అన్యాయమని విమర్శించారు. సామ్రాజ్యవాద అమెరికా పెత్తందారి పోకడల వల్ల ప్రపంచ శాంతి విచ్ఛిన్నమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
భారత ప్రభుత్వానికి డిమాండ్
ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ వెనుజులాకు అండగా నిలవాలని, మోడీ ప్రభుత్వం కూడా వెనుజులా ప్రజలను ఆదుకునే విధంగా స్పష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర కార్యదర్శి మాలోత్ సాగర్, జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోనె కుమారస్వామి, కన్నం వెంకన్న, జిల్లా నాయకులు సుంచు జగదీశ్వర్, ముక్కెర రామస్వామి, గణిపాక ఓదెలు, మహమ్మద్ మహబూబ్ బాషా, పరిమళ గోవర్ధన్, రాజు, ఎగ్గెని మల్లికార్జున్, మాలోత్ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.


