ఆదివాసీల ఆత్మగౌరవానికి మేడారం ప్రతీక
చిలకలగుట్ట పవిత్రత కాపాడటం అందరి బాధ్యత
పూజారులు–ఆదివాసీ సంఘాల మధ్య సమన్వయం అవసరం
జాతర విజయానికి ప్రత్యేక పాలసీ
భక్తుల సౌకర్యాలపైన ప్రభుత్వం దృష్టి
500 మందితో సేవా బృందం ఏర్పాటు : మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆదివాసీల ఆత్మగౌరవం, అస్తిత్వానికి ప్రతీకగా మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సమ్మక్క దేవత కొలువైన చిలకలగుట్ట పవిత్రతను కాపాడటం మన అందరి బాధ్యత అని, పూజారులు–ఆదివాసి సంఘాలు–అధికారుల సమన్వయంతోనే జాతరను విజయవంతం చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ఆదివారం తాడ్వాయి మండలం మేడారంలోని హరిత హోటల్లో సమ్మక్క–సారలమ్మ మహా జాతర–2026 నిర్వహణపై పూజారులు, ఆదివాసి సంఘాల నాయకులతో మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రాలతో కలిసి అభిప్రాయాల సేకరణ సమావేశం నిర్వహించారు.

ఆదివాసీల పాత్ర కీలకం
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… జాతర నిర్వహణలో పూజారులు, ఆదివాసి సంఘాల సహకారం కీలకమని తెలిపారు. జాతర నిర్వహణపై తమ సూచనలు, అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడించాలని సంఘాల నాయకులను కోరారు. సమావేశంలో వివిధ ఆదివాసి సంఘాల నాయకులు మాట్లాడుతూ… ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు రాజ్యాంగబద్ధంగా, గిరిజన హక్కులకు అనుగుణంగా కొనసాగేందుకు ప్రత్యేక పాలసీ రూపొందించాలని కోరారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేయాలని, భక్తులకు సేవలందించేందుకు 500 మంది ఆదివాసీ యువకులతో ప్రత్యేక సేవా బృందం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పూర్తిస్థాయిలో శాశ్వత ప్రాతిపదికన ఆదివాసీలతో కూడిన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు.
సమన్వయంతో జాతర విజయం
అనంతరం మంత్రి సీతక్క స్పందిస్తూ… పూజారులు, ఆదివాసి సంఘాల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని వారి సమన్వయంతో జాతరను విజయవంతం చేస్తామని తెలిపారు. కోట్లాది భక్తుల విశ్వాసానికి అనుగుణంగా మేడారం ఆలయ ప్రాంగణం తరతరాలకు గుర్తుండిపోయేలా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. సమ్మక్క–సారలమ్మ వారసులుగా గిరిజనులకు తగిన గుర్తింపు కల్పిస్తామని, ఆదివాసి సంఘాలు తమ సభ్యుల వివరాలను అధికారులకు అందించాలని సూచించారు.
భక్తుల సౌకర్యాలపై దృష్టి
చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను తీసుకువచ్చే సమయంలో ఆదివాసీ యువజన సంఘాలు సమన్వయం పాటించాలని, వాలంటరీ సేవల్లో మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. జాతర సమయంలో ఇసుక లారీలను పూర్తిగా నిలిపివేస్తామని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల దర్శనానికి ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ మనన్ భట్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్డీఓ వెంకటేష్, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఆదివాసి సంఘాల నాయకులు, ఐటీడీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


