శివాజీ విగ్రహ దహనానికి బాధ్యులెవరు?
వారం రోజుల్లో అరెస్టులు లేకపోతే రోడ్డెక్కుతాం
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
కాకతీయ, రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బందనపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు తగులబెట్టిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ… నిందితులను వెంటనే అరెస్టు చేయకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆదివారం ఆయన ఘటనా స్థలాన్ని సందర్శించి దెబ్బతిన్న శివాజీ విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం ఆరె కులస్తులు, గ్రామ సర్పంచ్ గుగులోతు అక్రీ రాంజీ నాయక్‌తో కలిసి శివాజీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ… దేశానికే గర్వకారణమైన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని అవమానించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కొందరు పనిగట్టుకుని ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
వారం రోజుల్లో అరెస్టు చేయాలి
ఈ ఘటనకు కారణమైన దుండగులను వారం రోజుల్లోనే పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. శివాజీ మహారాజ్ విగ్రహంపై జరిగిన దాడిని తేలిగ్గా తీసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. ఇటీవల శివాజీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు సరికాదని, వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని ఆరె భవన నిర్మాణ కమిటీ రాష్ట్ర చైర్మన్ కౌడగాని నరసింహారావు డిమాండ్ చేశారు. ఇటువంటి వ్యాఖ్యలే దుండగులకు ప్రోత్సాహంగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మూనావత్ నరసింహా నాయక్, జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, పూస మధు, గారె నర్సయ్య, చందు రాము, చిలువేరు సాయి గౌడ్, చందు సతీష్, వాలు నాయక్‌తో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.


