ముగ్గులతో కిసాన్‌నగర్‌లో సంక్రాంతి కళ
ముందస్తు వేడుకల్లో మహిళల ఉత్సాహం
విజేతలను అభినందించిన యాదగిరి సునీల్ రావు
కాకతీయ, కరీంనగర్ : ముందస్తు సంక్రాంతి వేడుకల సందర్భంగా కరీంనగర్ నగరంలోని కిసాన్‌నగర్ జమ్మిగద్దె సమీపంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఉత్సాహంగా సాగాయి. చాడ ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులతో పరిసర ప్రాంతాన్ని పండుగ వాతావరణంతో నింపారు. తెల్లవారుజామున నుంచే మహిళలు ఉత్సాహంగా ముగ్గులు వేస్తూ తమ ప్రతిభను ప్రదర్శించారు. సంప్రదాయ రూపాలు, ఆధునిక డిజైన్లతో వేసిన ముగ్గులు అందరి దృష్టిని ఆకర్షించాయి. ముందస్తు సంక్రాంతి సందడి కిసాన్‌నగర్ ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించింది.
ఈ పోటీలకు మాజీ మేయర్, బీజేపీ నాయకుడు యాదగిరి సునీల్ రావు హాజరై ముగ్గులను తిలకించారు. ప్రతిభ కనబరిచిన మహిళలను ఆయన అభినందించి, విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.సంక్రాంతి వంటి సంప్రదాయ పండుగలు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని, మహిళల ప్రతిభను వెలికితీసే ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాలని యాదగిరి సునీల్ రావు ఆకాంక్షించారు.


