పేరుకే సత్యం… పలికేది అసత్యం!
మేడిపల్లి సత్యంపై సుంకే రవిశంకర్ ఘాటు విమర్శలు
కొండగట్టు అభివృద్ధిపై తప్పుడు ప్రచారం
రూ.100 కోట్ల కేటాయింపు నిజం కాదా?
దమ్ముంటే రాజీనామా చేసి చర్చకు రా!
అభివృద్ధి గణాంకాలతో సత్యానికి సవాల్
కాకతీయ, కరీంనగర్ : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కొండగట్టు దేవాలయానికి ఒక్క రూపాయి కూడా రాలేదని ఎమ్మెల్యే సత్యం చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని ధ్వజమెత్తారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిధులు మంజూరు చేయడం శుభ పరిణామమని సుంకే పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబ దైవమే కొండగట్టు ఆంజనేయ స్వామి అని, అలాంటి పవిత్ర ఆలయానికి నిధులు ఇవ్వడం భక్తులందరికీ ఆనందకరమన్నారు. ఈ నిధుల మంజూరుతో తెలంగాణ ప్రభుత్వంలో కూడా చలనం వచ్చిందని వ్యాఖ్యానించారు.
రూ.100 కోట్లు నిజం కాదా..?!
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కొండగట్టు అభివృద్ధికి నిధులు కేటాయించలేదన్న ఎమ్మెల్యే సత్యం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శాసనమండలి సాక్షిగా గత ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని మంత్రి కొండా సురేఖ చెప్పిన మాటలు నిజమా? అబద్ధమా? అని ప్రశ్నించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కొండగట్టు వై జంక్షన్ వద్ద ప్రజల ముందుకు వచ్చి చర్చకు రావాలని సత్యానికి సవాల్ విసిరారు. తేదీ, సమయం చెబితే తన నాయకులతో కలిసి వస్తానన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొండగట్టులో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని సుంకే రవిశంకర్ స్పష్టం చేశారు. రూ.1.25 కోట్లతో కొత్త కోనేరు, రూ.2.5 కోట్లతో మెట్లదారి సుందరీకరణ, రూ.50 లక్షలతో రామస్తూప నిర్మాణం, రూ.2.5 కోట్లతో దీక్ష విరమణ మండపం, రూ.50 లక్షలతో కళ్యాణకట్ట ముందు సీసీ ఫ్లోరింగ్, రూ.30 లక్షలతో ఆలయం ముందు భాగం అభివృద్ధి, రూ.2.55 కోట్లతో ఈవో కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. అలాగే భక్తుల షెడ్డులకు రూ.50 లక్షలు, శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారానికి రూ.7 కోట్లు, గుట్ట కింద షాపింగ్ కాంప్లెక్స్‌కు రూ.కోటి, బేతాళ ఆలయం వద్ద ఫ్లోరింగ్‌కు రూ.20 లక్షలు, భక్తుల క్యూ లైన్‌కు రూ.15 లక్షలు, వరద కాలువ నుంచి నీటి పంపింగ్‌కు రూ.13.50 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. “ఇన్ని అభివృద్ధి పనులు కళ్లకు కనిపించడం లేదా?” అంటూ ఎమ్మెల్యే సత్యంపై విరుచుకుపడ్డారు.

ఆలయ భూమిపై కన్నేస్తే ఊరుకోం
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే 680 ఎకరాల విలువైన భూమిని కొండగట్టు దేవాలయానికి కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎమ్మెల్యేలా కాకుండా రౌడీలా ప్రవర్తిస్తున్నారని సత్యంపై విమర్శలు గుప్పించారు. ఇటీవల అటవీ శాఖ అధికారులు ఆలయ భూమిపై గుర్తింపులు వేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ… దేవాలయానికి చెందిన ఒక్క ఇంచు భూమిని కూడా ఎవరు లాక్కోవడానికి ప్రయత్నించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎంత దూరమైనా భక్తులతో కలిసి పోరాడతామని స్పష్టం చేశారు. సమావేశంలో గంట్ల వెంకటరెడ్డి, సాగి మహిపాల్ రావు, ఆకుల మధుసూదన్, చీకట్ల రాజశేఖర్, పూడూరు మల్లేశం, విజయేందర్ రెడ్డి, ఉప్పల గంగన్న, నాగశేఖర్, ఫైండ్ల శ్రీనివాస్, రామిడి సురేందర్, మామిడి తిరుపతి, తోట మురళి, శనిగరపు అనిల్, జగన్, గుడిసె తిరుపతి, చిరుత అంజయ్య, మిల్కుల తిరుపతి, మహేందర్, జనగం శ్రీనివాస్, తిరుపతిరెడ్డి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


