విద్యుత్ స్తంభానికి బైక్ ఢీ- ఒకరు మృతి
బురహాపురం శివారులో ప్రమాదం
కాకతీయ, మరిపెడ : మరిపెడ మండలంలోని బురహాపురం గ్రామ శివారు పద్మావతి పత్తి మిల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అదుపుతప్పిన ద్విచక్ర వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు తండాకు చెందిన దారావత్ రవీందర్ (55) వ్యక్తిగత పనుల నిమిత్తం బచ్చోడు గ్రామం నుంచి బురహాపురం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో పద్మావతి పత్తి మిల్లు వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.
ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వెంటనే మరిపెడ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.


