తప్పుల తడకగా ముసాయిదా ఓటర్ల జాబితా
క్యాతన్‌పల్లిలో ఓటర్ లిస్టులో అనేక లోపాలు
ఒక వార్డు ఓట్లు మరో వార్డులోకి.. బూత్‌లు మారి గందరగోళం
వందల సంఖ్యలో అభ్యంతరాలు
సవరణల కోసం మున్సిపల్ కార్యాలయానికి క్యూ
కాకతీయ, రామకృష్ణాపూర్ : జనవరి 1న క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా తీవ్ర విమర్శలకు గురవుతోంది. గత ఎన్నికల ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని రూపొందించిన ఈ లిస్ట్‌లో పోలింగ్ కేంద్రాల వారీగా అనేక తప్పులు దొర్లినట్లు వెల్లడైంది. ఒక వార్డులోని ఓట్లు మరో వార్డులోకి, ఒక బూత్ పరిధిలోని ఓట్లు మరో బూత్‌లోకి మారిపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందల సంఖ్యలో ఓట్లు ఇతర వార్డుల్లోకి వెళ్లిపోవడంతో తమ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఓటర్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ముసాయిదా ఓటర్ల జాబితాపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. తప్పులు సరిచేయాలని కోరుతూ వందల సంఖ్యలో వినతి పత్రాలు అందుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డుల వారీగా విడుదల చేసిన జాబితాలో అనేక లోపాలు ఉన్నాయని ఓటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వార్డుకు చెందిన ఓట్లు మరో వార్డులో కనిపించడం, కొందరికి రెండు ఓట్లు నమోదు కావడం వంటి లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. గ్రామంలో లేని వ్యక్తులు, మృతి చెందిన వారి పేర్లు కూడా ఓటర్ల జాబితాలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, ఓట్లు మాత్రమే కాకుండా పోలింగ్ బూత్‌లు కూడా మారిపోయాయని ఓటర్లు వాపోతున్నారు.

నేరుగా అభ్యంతరాలు స్వీకరిస్తున్నాం
మున్సిపల్ కార్యాలయంలో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై ఓటర్ల నుంచి నేరుగా అభ్యంతరాలు స్వీకరిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు తెలిపారు. కార్యాలయ ఆవరణలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు అందుతున్నాయని, అయితే ఈ నెల 5వ తేదీ సోమవారం వరకే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అభ్యంతరాలను అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం జనవరి 10న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని కమిషనర్ తెలిపారు.


