నదీజలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ ద్రోహం
ఫజల్ అలీ నుంచి విభజన వరకూ మోసాలు
పాలమూరుకు మరణశాసనం రాసింది కాంగ్రెస్సే
కాళేశ్వరంపై కక్ష.. ప్రాజెక్టులపై కుట్ర
ఉత్తమ్ కట్టుకథలు.. రేవంత్ పిట్టకథలు
కాంగ్రెస్ పార్టీయే తెలంగాణకు నెంబర్‌వన్ విలన్
కేసీఆర్ అన్న మాటలు నేడు అక్షర సత్యమవుతున్నాయి..
తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం వెనుక కాంగ్రెస్ ద్రోహమే ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నదీజలాల పంపిణీ- ప్రాజెక్టుల రూపకల్పనపై హరీష్‌రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈసందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ నదీజలాల పంపిణీ నుంచి ప్రాజెక్టుల రూపకల్పన వరకూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసిందని పేర్కొంటూ.. గణాంకాలు, డాక్యుమెంట్లతో ప్రజంటేషన్ ఇచ్చారు. తెలంగాణకు అన్ని విధాలుగా నష్టం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఫజల్ అలీ కమిషన్ తెలంగాణను ప్రత్యేకంగా ఉంచాలని సూచించినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రాలో కలిపి తెలంగాణకు ద్రోహం చేసిందని హరీశ్‌రావు అన్నారు. విభజన సమయంలోనూ నీళ్లు, ప్రాజెక్టుల విషయంలో మనకు తీరని అన్యాయం జరిగిందన్నారు. 11వ షెడ్యూల్‌లో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును చేర్చకుండా కాంగ్రెస్ కావాలనే నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.

పాలమూరుపై కాంగ్రెస్ పగ
పాలమూరు ప్రాంతానికి మరణశాసనం రాసిందే కాంగ్రెస్ అని హరీశ్‌రావు మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజన తర్వాతనూ పాలమూరును కావాలనే నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. పాలమూరుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్, టీడీపీ ద్రోహం చేస్తే, ఇప్పుడు రేవంత్‌రెడ్డి అదే ద్రోహాల పరంపర కొనసాగిస్తున్నారని అన్నారు. నిపుణుల సహకారంతో కేసీఆర్ కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులను రూపకల్పన చేశారని తెలిపారు. రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరాన్ని పాడైందన్నట్టు చిత్రీకరించారని విమర్శించారు. రూ.100–200 కోట్లు ఖర్చు పెడితేనే 5–6 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉందని, కానీ రెండేళ్లుగా కాళేశ్వరంపై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. రైతాంగంపై, ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్ పగబట్టిందని ఆరోపించారు.

తొమ్మిదిన్నరేళ్లలో 17 లక్షల 24 వేల ఎకరాల కొత్త ఆయకట్టు..
ఉమ్మడి రాష్ట్రంలో 1956 నుంచి 2004 వరకు కేవలం 36 లక్షల ఎకరాల ఆయకట్టే వచ్చిందని హరీశ్‌రావు తెలిపారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కొత్తగా వచ్చిన ఆయకట్టు 5 లక్షల 71 వేల ఎకరాలే అన్నారు. అదే బీఆర్‌ఎస్ పాలనలో తొమ్మిదిన్నరేళ్లలో 17 లక్షల 24 వేల ఎకరాల కొత్త ఆయకట్టు, మొత్తం 48 లక్షల 74 వేల ఎకరాల ఆయకట్టు సాధించామని వివరించారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో స్టెబులైజేషన్ 93 వేల ఎకరాలకే పరిమితమైతే, బీఆర్‌ఎస్ పాలనలో 31 లక్షల 50 వేల ఎకరాల స్టెబులైజేషన్ సాధించామని చెప్పారు. చెరువులను పట్టించుకోని కాంగ్రెస్‌కు భిన్నంగా మిషన్ కాకతీయ ద్వారా 25 లక్షల ఎకరాల ఆయకట్టు సాధించామని స్పష్టం చేశారు. ఎస్సారెస్పీ స్టేజ్–2కు కాళేశ్వరం నీళ్లు అందించిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పారని, నదీజలాల విషయంలో కాంగ్రెస్ చేసిన ద్రోహాలు ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోతాయని హరీశ్‌రావు అన్నారు.


