జిల్లా ఉత్తమ మహిళా ఉపాధ్యాయురాలిగా విజయలక్ష్మి
సైదాపూర్ మండలం వెన్నంపల్లి పాఠశాల ఉపాధ్యాయురాలికి గౌరవం
కలెక్టరేట్ వేదికగా అధికారుల అభినందనలు
ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో హర్షాతిరేకాలు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న తాళ్లపల్లి విజయలక్ష్మి జిల్లా ఉత్తమ మహిళా ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. సావిత్రిబాయి ఫూలే 195వ జయంతి సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశ్విని తానాజీ వాఖడే ఆమెను శాలువాతో సత్కరించి ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తాళ్లపల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ… మహిళల విద్య కోసం జీవితాంతం పోరాటం చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే తనకు ఆదర్శమని పేర్కొన్నారు. ఆమె చూపిన మార్గంలోనే విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణానికి నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ గౌరవం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. విజయలక్ష్మి జిల్లా ఉత్తమ మహిళా ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడంపై మండల విద్యాధికారి కట్ట రవీంద్రాచారి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దేవేందర్ రెడ్డి, జయశ్రీ, రామలక్ష్మి, అనిల్ రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను సత్కరించారు.


