మేయర్ పీఠం బీజేపీదే
ఎన్నికలప్పుడే మైనార్టీలు గుర్తుకు వస్తారా?
మైనార్టీలను మోసం చేసేందుకు త్రిపక్ష కుట్ర
కాంగ్రెస్–బీఆర్‌ఎస్–ఎంఐఎం కుమ్మక్కు
కరీంనగర్ అభివృద్ధి కేంద్ర నిధుల వల్లే
బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ సమీ పర్వేజ్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి మైనార్టీలను మోసం చేసే రాజకీయ కుట్రకు తెరలేపాయని బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ సమీ పర్వేజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ కార్పొరేషన్ ఎన్నికల కోసం రాజకీయ డ్రామాలు మొదలుపెట్టిందని విమర్శించారు. కరీంనగర్ నగర అభివృద్ధి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమైందని సమీ పర్వేజ్ పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెచ్చిన నిధులతో పట్టణంతో పాటు మైనార్టీ డివిజన్లలో అభివృద్ధి జరిగిందన్నారు. సుకన్య సమృద్ధి యోజన, ఉజ్వల యోజన, వీధి వ్యాపారుల రుణాలు, పీఎంఈజీపీ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మైనార్టీలకు గణనీయమైన లబ్ది చేకూరిందని తెలిపారు.
ఓటు బ్యాంకుగానే మైనార్టీలు?
ఎన్నికలు వచ్చినప్పుడే మైనార్టీలు ఎంఐఎం పార్టీకి గుర్తుకు వస్తారని, ఆ తర్వాత వారి సమస్యలపై స్పందించిన దాఖలాలు లేవని విమర్శించారు. గతంలో టీఆర్‌ఎస్‌తో, ప్రస్తుతం కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకొని మైనార్టీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటోందని ఆరోపించారు. కుల, మతాలకతీతంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని, నిజమైన మైనార్టీ సంక్షేమం బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగురుతుందని, మేయర్ పీఠం కూడా బీజేపీదేనని మొహమ్మద్ సమీ పర్వేజ్ ధీమా వ్యక్తం చేశారు.


