మహిళా సాధికారతకు పూలే మార్గదర్శకం
కాకతీయ, హుజురాబాద్ : భారతదేశపు తొలి మహిళా గురువు, సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే జయంతి వేడుకలు హుజురాబాద్ పట్టణంలో ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కూడలిలో పూలే జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఇప్పలపల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సావిత్రీబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించి గౌరవించారు. పూలే ఆశయాలను గుర్తు చేస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ సావిత్రీబాయి పూలే జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహిళాభ్యుదయం, మహిళా సాధికారత కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అనేక అవమానాలు, అవరోధాలను ఎదుర్కొని భర్త జ్యోతిరావు పూలే సహకారంతో మహిళల విద్య కోసం పాఠశాలలు స్థాపించి సమాజ మార్పుకు బాటలు వేసిన మహానీయురాలిగా ఆమెను కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కెంసారపు సమ్మయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, పూలే జయంతి ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, ఉప్పు శ్రీనివాస్, ఇప్పకాయల సాగర్, చిలుకమారి శ్రీనివాస్, సందెళ్ల వెంకన్నతో పాటు ప్రజాసంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


