దేవుని గుట్టలో జాతర పనులకు శ్రీకారం
సంక్రాంతి జాతరకు సన్నాహాలు ప్రారంభం
వెంకటేశ్వర స్వామి కల్యాణానికి ఏర్పాట్లు
కల్యాణ మంటపం చుట్టూ చదును పనులు
కాకతీయ, నెల్లికుదురు : నెల్లికుదురు మండలం నైనాల గ్రామంలో ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించే దేవుని గుట్ట వెంకటేశ్వర స్వామి కల్యాణం జాతరకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దేవుని గుట్ట వద్ద స్వయంభూగా వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం కల్యాణ మంటపం చుట్టూ చదును చేసి మట్టి తోలే పనులను శనివారం గ్రామ సర్పంచ్ యాసం సంధ్య రమేష్, ఉపసర్పంచ్ పెరుమాండ్ల ఉపేందర్ గౌడ్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సంధ్య రమేష్ మాట్లాడుతూ… సంక్రాంతి పండుగ సందర్భంగా దేవుని గుట్ట వద్ద జరిగే వెంకటేశ్వర స్వామి కల్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కల్యాణ మంటపం చుట్టూ ఉన్న చెట్లను తొలగించి మట్టి పోసి చదును చేసే పనులు చేపట్టామని చెప్పారు.
దాతల సహకారం అభినందనీయం
ఈ అభివృద్ధి పనులకు గ్రామ ఉపసర్పంచ్ పెరుమాండ్ల ఉపేందర్ గౌడ్, జెసిపి దాత బండారి కరుణాకర్, ట్రాక్టర్ దాతలు ఆకుల యాకయ్య, దాసరి యాకయ్య, ఆకుల అనిల్, ఆకుల వెంకటేష్, వార్డు సభ్యులు అందించిన సహకారం అభినందనీయమన్నారు. దాతలందరికీ, వారి కుటుంబ సభ్యులకు శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షాలు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఏర్పుల శృతి సరేష్, ఆవుల సాయిమల్లు, బత్తిని అజయ్, ఆకుల సురేష్, విక్కీ, గిరిశెట్టి కరుణ, శివర్ల ఎలేంద్ర, యాసం వెంకటేశ్వర్లు, బొడ్డు విజయ్ కుమార్, ఆకుల జ్యోతి, నారాబోయిన రమ తదితరులు పాల్గొన్నారు.


