తూర్పులో టఫ్ జాబ్
పోలీసులకు విధి నిర్వహణ కత్తిమీద సామే..!
ఒకరి మాట వింటే మరొకరికి కోపం
ఫలితంగా బదిలీలు..సస్పెన్షన్లు..! లేదంటే ఫిర్యాదులు
ఖాకీలపై ఒత్తిళ్లు.. మానసిక నైతిక స్థైర్యం కోల్పోతున్న అధికారులు
ఇలా అయితే ఏం పనిచేస్తామంటూ ఉన్నతాధికారుల వద్ద నిర్వేదం
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న పోలీసు అధికారుల బదిలీలు, సస్పెన్షన్ల అంశం శాఖా స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై ఏర్పడుతున్న ఒత్తిళ్లు, తీసుకుంటున్న పరిపాలనా నిర్ణయాల వల్ల క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది నైతిక స్థైర్యంపై ప్రభావం పడుతున్నట్లు సమాచారం. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న పలువురు అధికారులు, సిబ్బంది చట్టం, నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తిస్తున్న సందర్భాల్లో వివిధ స్థాయిల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో కొంతమంది అధికారులను అకస్మాత్తుగా బదిలీ చేయడం, మరికొందరిపై శాఖాపరమైన చర్యలు చేపట్టడం జరగడంతో శాఖలో ఆందోళన వాతావరణం నెలకొంది.
పోస్టింగులు.. బదిలీలపై అసంతృప్తి
సున్నితమైన కేసుల్లో చట్టపరంగా చర్యలు తీసుకున్న అధికారులపై అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో, వారిని కీలక బాధ్యతల నుంచి తొలగించడం లేదా లూప్ లైన్ పోస్టింగులకు పంపడం జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీని వల్ల విధి నిర్వహణలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడంపై అధికారులు వెనుకడుగు వేస్తున్న పరిస్థితి ఏర్పడుతున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం పనిచేసినా, అనూహ్యంగా బదిలీలు లేదా సస్పెన్షన్లు ఎదురయ్యే పరిస్థితి ఉండటంతో పోలీసు సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. శాఖాపరంగా మద్దతు లభించకపోతే విధి నిర్వహణలో ధైర్యం తగ్గే అవకాశముందని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల ప్రభావంతో నిజాయితీగా పనిచేసే అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతింటోందని, దీని ప్రభావం శాంతిభద్రతల పరిరక్షణపై కూడా పడే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అంతర్గతంగా చర్చించుకోవడం గమనార్హం.
ఇలా అయితే ఎలా సార్..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న ఈ పరిణామాలపై ఉన్నతాధికారులు సమగ్రంగా సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ లేదా ఇతర జోక్యాలతో సంబంధం లేకుండా.. చట్టబద్ధంగా విధులు నిర్వర్తించే వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని, అప్పుడే శాఖా పరిపాలన సమర్థవంతంగా కొనసాగుతుందని పోలీసు వర్గాలు ఉన్నతాధికారుల వద్ద మొర పెట్టుకుంటున్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. రాజకీయ ఒత్తిళ్ల మధ్య చట్టప్రకారం నిర్ణయాలు తీసుకోవడం పోలీసులకు కష్టసాధ్యంగా మారుతోంది. ఒక వైపు నిబంధనలు పాటించాల్సి రావడం, మరోవైపు రాజకీయ నేతల ఆగ్రహానికి గురికావాల్సి రావడం వల్ల “ముందు నుయ్యి.. వెనక గొయ్యి” అన్న పరిస్థితి ఏర్పడింది. వరంగల్ తూర్పులో నేతల ఆధిపత్య పోరు వల్ల పోలీసు యంత్రాంగం నైతిక స్థైర్యం కోల్పోతుందని, ఇది శాంతిభద్రతలపై ప్రభావం చూపే అవకాశం ఉందని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


