మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ
పీఎల్‌జీఏ బెటాలియన్ కమాండర్ దేవా, కీలక నేత రాజిరెడ్డి లొంగుబాటు
వారితో పాటు మొత్తం 20 మంది డీజీపీ ఎదుట సరెండర్
48 ఆయుధాలు, 2,206 రౌండ్ల అమోనియం స్వాధీనం
మిగతా మావోయిస్టులు సైతం జనంలోకి రావాలి
తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి పిలుపు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : సీపీఐ (మావోయిస్టు) సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టుల చివరి ప్రధాన కోటగా భావించిన పీఎల్‌జీఏ బెటాలియన్ పూర్తిగా కూలిపోయింది. పీఎల్‌జీఏ బెటాలియన్ కమాండర్ **బడ్సే సుక్కా అలియాస్ దేవా (డీకే ఎస్‌జెడ్‌సీఎం)తో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ కీలక నేత కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ (ఎస్‌సీఎం) సహా మొత్తం 20 మంది అండర్‌గ్రౌండ్ మావోయిస్టు కేడర్లు, 48 ఆయుధాలు, 2,206 రౌండ్ల అమ్యూనిషన్‌తో తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ లొంగుబాటుతో తెలంగాణ స్టేట్ కమిటీ పూర్తిగా క్షీణించినట్లు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం టీఎస్‌సీలో ఒక్క స్టేట్ కమిటీ మెంబర్ మాత్రమే మిగిలి ఉన్నట్లు వెల్లడించారు. లొంగిపోయిన కేడర్లు పీఎల్‌జీఏకి చెందిన ఆయుధ గోదాముల వివరాలను పోలీసులకు అందజేశారు. ఈ సందర్భంగా
2 ఎల్‌ఎంజీలు, 8 ఏకే–47 రైఫిళ్లు, 10 ఇన్సాస్ రైఫిళ్లు, 8 ఎస్‌ఎల్‌ఆర్‌లు, ఒక యూఎస్ మేడ్ కోల్ట్ రైఫిల్, ఒక ఇజ్రాయెల్ మేడ్ టావర్ రైఫిల్, 4 బీజీఎల్‌లు, 2 గ్రెనేడ్లు సహా మొత్తం 48 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రూ.20.30 లక్షల నగదును కూడా సీజ్ చేశారు.

దాడుల వ్యూహకర్త.. బడ్సే దేవా
బడ్సే సుక్కా అలియాస్ దేవా సీపీఐ (మావోయిస్టు)లో రెండో అత్యంత కీలక గిరిజన నేతగా గుర్తింపు పొందాడు. జెరాం ఘాటి దాడి సహా అనేక ఘాతుకాలకు వ్యూహకర్తగా వ్యవహరించిన ఇతనిపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాలు, ఎన్ఐఏ కలిసి రూ.75 లక్షల రివార్డు ప్రకటించాయి. 2025 అక్టోబర్ 21న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేసిన శాంతి పిలుపుకు స్పందిస్తూ మావోయిస్టులు హింసా మార్గాన్ని విడిచి ప్రజాజీవనంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు లొంగుబాటు సమయంలో తెలిపారు. అంతర్గత విభేదాలు, భద్రతా బలగాల నిరంతర ఒత్తిడి, లాజిస్టిక్ నెట్‌వర్క్ క్షీణత, కుటుంబాల నుంచి దూరం కావడం వంటి కారణాలతో ఉద్యమంపై నమ్మకం కోల్పోయినట్లు పేర్కొన్నారు. లొంగిపోయిన 20 మందికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం మొత్తం రూ.1.81 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నారు. తాత్కాలికంగా ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున వెంటనే అందజేశారు.
ఈ చారిత్రక లొంగుబాటుకు కృషి చేసిన భద్రతా బలగాలను తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ప్రశంసించారు. ఇంకా అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మావోయిస్టులు ఆయుధాలు వీడి శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.



