రైతులకు మళ్లీ తీపి కబురు
పీఎం కిసాన్ 22వ విడతకు కసరత్తు
రూ.2,000 కోసం రైతుల ఎదురుచూపులు
ఫిబ్రవరిలో ఖాతాల్లో జమ అయ్యే అవకాశం
9 కోట్ల మందికి లబ్ధి.. అయితే ఈ-కేవైసీ తప్పనిసరి
కాకతీయ, స్పెషల్ డెస్క్ : దేశంలోని కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. సాగు ఖర్చులు పెరిగి పెట్టుబడి భారమవుతున్న తరుణంలో, అన్నదాతలకు అండగా నిలిచే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 22వ విడత నిధుల విడుదలపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. 2026 కొత్త ఏడాది ప్రారంభంతో రైతులందరి దృష్టి తమ ఖాతాల్లోకి వచ్చే రూ.2,000పైనే నిలిచింది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు కోసం రైతులు అప్పుల పాలవకుండా ఉండాలన్న లక్ష్యంతో 2019లో ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం అందుతోంది. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున మూడు విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ఇప్పటివరకు 21 విడతలను ప్రభుత్వం విజయవంతంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానం వల్ల మధ్యవర్తుల జోక్యం లేకుండా డబ్బులు అందుతుండటంతో రైతుల్లో నమ్మకం పెరిగింది.
22వ విడత ఎప్పుడంటే..?!
ప్రస్తుతం 22వ విడత విడుదలపై అధికారిక ప్రకటన రాకపోయినా, గత అనుభవాలను బట్టి చూస్తే ఫిబ్రవరి 2026లో నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. బడ్జెట్ అనంతరం లేదా ఫిబ్రవరి రెండో వారంలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కావచ్చని అంచనా. రబీ సాగు పనులు ఊపందుకునే సమయంలో ఈ నిధులు రైతులకు పెద్ద ఊరటగా మారనున్నాయి. చాలామంది రైతులకు నిధులు నిలిచిపోవడానికి ప్రధాన కారణం చిన్న సాంకేతిక లోపాలే. 22వ విడత సాయం ఎలాంటి ఆటంకం లేకుండా రావాలంటే రైతులు ఈ విషయాలు తప్పనిసరిగా పూర్తి చేయాలి.
ఈ-కేవైసీ పూర్తి చేయాలి – ఆధార్ ద్వారా పీఎం కిసాన్ పోర్టల్‌లో.
బ్యాంకు ఖాతా–ఆధార్ లింక్ అయి ఉండాలి.
డీబీటీ ఆప్షన్ ఎనేబుల్ అయి ఉండాలి.
భూమి రికార్డులు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ అయి ఉండాలి.
ఈ మూడింటిలో ఏ ఒక్కటిలో తప్పు ఉన్నా నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది.


