ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ
జైలు డైరీ చదివానంటూ మద్దతు
వివాదంగా మారిన స్పందన
2020 దిల్లీ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉమర్ ఖాలిద్ అరెస్టు
న్యూఢిల్లీ/న్యూయార్క్ : దిల్లీ అల్లర్ల కేసులో దాదాపు ఐదేళ్లుగా జైలులో ఉన్న జేఎన్‌యూ మాజీ విద్యార్థి, కార్యకర్త ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన జోరాన్ మమ్దానీ మద్దతుగా లేఖ రాయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఖాలిద్ సోదరి వివాహం కోసం 14 రోజుల బెయిల్‌పై విడుదలకు కొద్ది రోజుల ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది. డిసెంబర్ 9న ఉమర్ ఖాలిద్ తండ్రి సయ్యద్ ఖాసిమ్ రసూల్ ఇల్యాస్ న్యూయార్క్‌లో మమ్దానీని సుమారు 25 నిమిషాల పాటు కలిశారు. 2023లో ఉమర్ ఖాలిద్ జైలు డైరీని చదివినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ భేటీని ఏర్పాటు చేసినట్లు ఇల్యాస్ తెలిపారు. “ఉమర్ జైల్లో ఉండటం గురించి తాను ఎప్పుడూ ఆలోచిస్తుంటానని, అతడికి బెయిల్ రావాల్సిన అవసరం ఉందని మమ్దానీ అన్నారు” అని ఇల్యాస్ వెల్లడించారు. ఈ సమావేశం అనంతరం మమ్దానీ ఉమర్ ఖాలిద్‌కు వ్యక్తిగతంగా లేఖ రాశారు. “కోపాన్ని మన మనసును ఆక్రమించనివ్వకూడదన్న నీ మాటలు నన్ను ఆలోచింపజేస్తుంటాయి. నీ తల్లిదండ్రులను కలవడం ఆనందంగా ఉంది. మేమంతా నిన్నే ఆలోచిస్తున్నాం” అంటూ మమ్దానీ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మమ్దానీ తనను, ఉమర్ ఖాలిద్‌ను సామాన్యుల సమస్యల కోసం పోరాడిన వ్యక్తులుగా పోల్చారని ఇల్యాస్ చెప్పారు. “ఈ విషయంలో తాను ఏమి చేయగలనని మమ్దానీ అడిగితే, ప్రార్థించడమే సరిపోతుందని చెప్పాను” అని ఆయన తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టులో జరిగిన వాదనల సమయంలో తాను హాజరైనట్లు, న్యాయపరంగా సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆశిస్తున్నట్లు ఇల్యాస్ పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై బీజేపీ నేత గౌరవ్ భాటియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమర్ ఖాలిద్ కేసు భారత్‌కు సంబంధించిన అంతర్గత వ్యవహారమని, విదేశీ నేతల జోక్యం సరికాదని వ్యాఖ్యానించారు.
దిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్ అరెస్టు..
2020 ఫిబ్రవరిలో జరిగిన దిల్లీ అల్లర్లకు సంబంధించి ఉమర్ ఖాలిద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అల్లర్లలో 53 మంది మరణించారు. సోదరి వివాహానికి హాజరయ్యేందుకు డిసెంబర్ 16 నుంచి 29 వరకు అతడికి తాత్కాలిక బెయిల్ మంజూరైంది. ఇదిలా ఉండగా, అమెరికా కాంగ్రెస్ సభ్యులు జిమ్ మెక్‌గవర్న్, జేమీ రాస్కిన్ సహా మరో ఆరుగురు శాసనసభ్యులు భారత రాయబారి వినయ్ క్వాత్రాకు లేఖ రాసి, దిల్లీ అల్లర్ల కేసుల్లో నిందితులపై కొనసాగుతున్న దీర్ఘకాలపు ముందస్తు నిర్బంధంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉమర్ ఖాలిద్ అరెస్టు విషయంలో విచారణ, న్యాయ ప్రక్రియ న్యాయసమ్మతతపై మానవ హక్కుల సంస్థలు, న్యాయ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయని వారు పేర్కొన్నారు.


