అసెంబ్లీకి దూరం… బయట రాజకీయం
సమావేశాల బీఆర్ ఎస్ బహిష్కరించడంపై భిన్న వాదనలు
‘ఒక అంశాన్ని సాకుగా చూపి సభ బాయ్‌కాట్ ఎందుకు?’
అసెంబ్లీలో ప్రశ్నించాల్సిన విషయాలు బయటే చర్చా?
కాంగ్రెస్–బీఆర్‌ఎస్ నేతల మధ్య పరస్పర విమర్శలు
నదీజలాలపై ఎవరి ప్రజెంటేషన్ వారిదే!
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ శాసనసభ సమావేశాలను బీఆర్‌ఎస్ బహిష్కరించడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. తాజా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్న బీఆర్‌ఎస్… సభలో వాకౌట్ చేసి పూర్తిస్థాయిలో బాయ్‌కాట్‌కు దిగింది. అయితే దీనిపై కాంగ్రెస్ వాదన భిన్నంగా ఉంది. ఒకే అంశాన్ని సాకుగా చూపి మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మూసీ ప్రక్షాళన అంశంపై మైక్ ఇవ్వలేదన్న కారణాన్ని చూపిస్తూ సభకు దూరంగా ఉండడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక అంశంపై మాట్లాడనివ్వలేదని చెబుతూ… మిగతా ప్రజా సమస్యలపై ఎందుకు చర్చించకూడదని కాంగ్రెస్ నిలదీస్తోంది. బీఆర్‌ఎస్ లొసుగులు బయటపడతాయన్న భయంతోనే అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటోందని ఆరోపిస్తోంది.
నదీజలాలపై రెండు వేదికలు
కృష్ణా జలాల వాటాపై రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న నేపథ్యంలోనూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభకు దూరంగా ఉండనున్నారు. అదే సమయంలో బీఆర్‌ఎస్ తరఫున హరీశ్ రావు తెలంగాణ భవన్‌లో వేరు ప్రజెంటేషన్ ఇస్తారంటూ ప్రకటన చేశారు. నదీజలాల వంటి కీలక అంశంపై అసెంబ్లీ వేదికను వదిలేసి… ఎవరి వేదికల్లో వారు ప్రజెంటేషన్లు ఇవ్వడంపై రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నదీజలాల అంశంపై రాజకీయ రగడ మొదలుపెట్టింది బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌నేనని కాంగ్రెస్ గుర్తుచేస్తోంది. అలాంటప్పుడు అదే అంశంపై అసెంబ్లీలో ప్రశ్నించకుండా బయట రాజకీయాలు చేయడం ఏమిటని నిలదీస్తోంది. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, ఆయనతో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలూ సభకు రాకుండా బయట నుంచే పోరాటం చేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తోంది.
‘సభలోనే ప్రశ్నించండి’
బయట ప్రశ్నించే అంశాలన్నింటినీ అసెంబ్లీలోనే ప్రశ్నిస్తే ప్రజలకు స్పష్టత వస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తమ ప్రభుత్వం తప్పు చేస్తే సభలోనే నిలదీయాలని, అందుకు సిద్ధమేనని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. కానీ అసెంబ్లీకి రావడానికి బీఆర్‌ఎస్ సిద్ధంగా లేకపోవడమే అసలు సమస్యగా మారిందని వ్యాఖ్యానిస్తోంది. మొత్తానికి నదీజలాల అంశంపై ఎవరి దారి వారిదే అన్నట్టుగా పరిస్థితి మారింది. శాసనసభ వేదిక ఖాళీగానే ఉండగా… రాజకీయ పోరాటం మాత్రం బయట ముదురుతోంది.


