కాకతీయ, తెలంగాణ బ్యూరో: వరుస విమాన ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. రోజుకో విమాన వార్త సర్వసాధారణంగా మారింది. ప్రపంచంలో ఎక్కడోచోట ఏదొక విమానం ప్రమాదానికి గురవుతూనే ఉంది. ప్రమాదాలు, సాంకేతిక లోపాలు విమానాల్లో బయటపడుతున్న విమానాలకు సంబంధించి కంపెనీలు ఏమాత్రం చలించడం లేదు. ప్రజల ప్రాణాలు కూడా లెక్కనట్లు వ్యవహరిస్తూ..కార్పొరేట్ బుద్ధిని చాటుతున్నాయి.
తాజాగా శంషాబాద్ ఓ విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరిన అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పైలెట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో తిరిగి వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 67 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులను కిందికి దింపి సాంకేతిక లోపాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతి వెళ్లాల్సిన 67 మంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.


