మహిళా సాధికారతకు మార్గదర్శి సావిత్రిబాయి పూలే
సమాజ మార్పుకు ధ్రువతారగా నిలిచిన మహనీయురాలు
పూలే ఆశయాలే నేటి విద్యా స్వేచ్ఛకు బీజం
బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ గిర్మాజీపేటలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గడల కుమార్ ఆధ్వర్యంలో సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే భారతదేశ విద్యా చరిత్రలో ఒక ధ్రువతార అని అన్నారు. అణగారిన వర్గాలు, మహిళలు, బహుజనుల కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆమె కేవలం తొలి మహిళా ఉపాధ్యాయురాలే కాకుండా, సమాజంలోని మూఢనమ్మకాలకు ఎదిరించిన గొప్ప విప్లవకారిణి అని కొనియాడారు. ఆ రోజుల్లో మహిళలు చదువుకోవడం పాపంగా భావించే పరిస్థితుల్లో, సావిత్రిబాయి పూలే పాఠశాలకు వెళ్తుంటే కొందరు ఆమెపై రాళ్లు, పేడలు విసిరేవారని గుర్తుచేశారు. అయినప్పటికీ ఆమె మరో చీరను వెంట తీసుకెళ్లి, ధైర్యంగా తన కర్తవ్యాన్ని కొనసాగించారన్నారు. వితంతువుల కోసం ఆశ్రమాలు ఏర్పాటు చేయడం, అంటరానితనం నిర్మూలనకు కృషి చేయడం వంటి అనేక సామాజిక కార్యక్రమాలు ఆమె చేపట్టారని తెలిపారు. నేడు మనం అనుభవిస్తున్న విద్యా స్వేచ్ఛ సావిత్రిబాయి పూలే వేసిన పునాదుల ఫలితమేనని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి అని గంట రవికుమార్ స్పష్టం చేశారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, సీనియర్ నాయకులు సముద్రాల పరమేశ్వర్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పోలేపాక మార్టిన్ లూథర్, జిల్లా కార్యదర్శి గోకే వెంకటేష్, జిల్లా నాయకులు పొట్టి శ్రీనివాస్ గుప్తా, సిద్ధోజు శ్రీనివాస్, ఎల్లబోయిన చంద్ర మోహన్, శివనగర్ మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ, మండల నాయకులు మామిడాల సతీష్, అక్కినే సాగర్, సాంబరాజు కమలాకర్, తమ్మీశెట్టి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


