పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య
కాకతీయ, కరీంనగర్ : పెళ్లి కావడం లేదనే నిరాశతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. జమ్మికుంట మండలం బోగంపాడు గ్రామానికి చెందిన రత్న నెతజీ (24), తండ్రి రత్న సంపత్, గత కొంతకాలంగా పెళ్లి విషయంలో ఎదురవుతున్న ఆటంకాలతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 30, 2025న నెతజీ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని హుజురాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ జనవరి 2, 2026 తెల్లవారుజామున 1 గంట 30 నిమిషాల సమయంలో నెతజీ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రత్న సంపత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇల్లందకుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు


