కార్యాలయాల ముఖచిత్రం మారాలి!
ఉద్యోగులకు మెరుగైన వసతులు తప్పనిసరి
ప్రభుత్వ భవనాల మరమ్మతులపై ప్రతిపాదనలు పంపండి
పర్యాటకుల కోసం హరిత హోటల్‌కు స్థలాన్ని సేకరించాలి
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి .. జిల్లా కేంద్రంలో క్షేత్రస్థాయి తనిఖీలు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ప్రజాసేవల నాణ్యత పెరగాలంటే ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు అనుకూల వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. కార్యాలయ భవనాల మరమ్మత్తులు, మౌళిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. బస్‌డిపో రోడ్‌లోని డీఆర్డీఎ భవనం, ఆర్ & బీ ఇంజనీరింగ్ కార్యాలయం, బాల రక్షా భవనం, గిరిజన భవనం, ఆర్ & బీ గెస్ట్ హౌజ్‌తో పాటు ఇతర శాఖల కార్యాలయాల పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఉద్యోగులతో నేరుగా సంభాషణ
కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందితో నేరుగా మాట్లాడిన కలెక్టర్, మౌళిక వసతులు, పని వాతావరణం, ఎదురవుతున్న ఇబ్బందులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవనాల స్థితిగతులు, మరమ్మత్తుల అవసరం, విద్యుత్, నీటి సౌకర్యాలు, పారిశుద్ధ్యం, ఫర్నిచర్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే ఉద్యోగులకు తగిన మౌళిక సదుపాయాలు కల్పించాల్సిందేనని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయ భవనాల మరమ్మత్తులు, అవసరమైన వసతుల కల్పనపై శాఖల వారీగా సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి తక్షణమే సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గిరిజన భవనం, గెస్ట్ హౌజ్‌ల అభివృద్ధి
గిరిజన భవనం, ఆర్ & బీ గెస్ట్ హౌజ్‌ల ప్రస్తుత పరిస్థితులను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టి భవనాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఉద్యోగులకు అనుకూలమైన కార్యాలయ వాతావరణమే సమర్థవంతమైన పాలనకు ఆధారమని తెలిపారు. అనంతరం జిల్లాకు వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం నిర్మించనున్న హరిత హోటల్‌కు అనువైన స్థలం గుర్తించే దిశగా కలెక్టర్ చర్యలు చేపట్టారు. ఖమ్మం కేంద్రంలోని ఎన్ఎస్పీ క్యాంప్‌తో పాటు పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వ స్థలాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, సర్వేయర్లు నాగేశ్వరరావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


