తీగలగుట్టపల్లిలో భూ కబ్జాల కలకలం
ప్రభుత్వ స్థలాలపై అపార్ట్‌మెంట్లు
పాఠశాల, పార్కుల భూములకూ గండం
కమిషనర్‌కు కాంగ్రెస్ పార్టీ డివిజన్–2 ఇంచార్జి కొలగాని అనిల్ ఫిర్యాదు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ నగరంలో ప్రభుత్వ భూముల కబ్జాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లి (డివిజన్ నెం.2)లో ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాలు అక్రమ ఆక్రమణలకు గురవుతున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ డివిజన్–2 ఇంచార్జి కొలగాని అనిల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన కార్పొరేషన్ కమిషనర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. సర్వే నెం.120లో గతంలో ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా లేఅవుట్ రూపొందించి ఇండ్ల స్థలాలు కేటాయించిందని, అదే లేఅవుట్‌లో పాఠశాల, టౌన్ హాల్, గుడి, మసీదు, చర్చి, పార్కులు వంటి ప్రజా అవసరాల కోసం భూములను ప్రత్యేకంగా గుర్తించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ భూముల్లో కొన్ని ఇప్పటికే అక్రమ నిర్మాణాలకు గురై, అపార్ట్‌మెంట్లు, నివాస గృహాలు నిర్మించినట్లు ఆరోపించారు. ముఖ్యంగా పాఠశాల, పార్క్‌కు కేటాయించిన ప్రభుత్వ భూములపై నిర్మాణాలు జరగడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.
సమగ్ర విచారణ జరపాలి
అదే సర్వే నెంబరులో ఇంకా మిగిలి ఉన్న ప్రభుత్వ భూములను తక్షణమే గుర్తించి, అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కొలగాని అనిల్ డిమాండ్ చేశారు. ప్రజల వినియోగానికి కేటాయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ భూ కబ్జాలకు సంబంధించి లేఅవుట్ ప్లాన్‌లు, ఫోటో ఆధారాలను కమిషనర్‌కు సమర్పించినట్లు ఆయన తెలిపారు. ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూములపై బహిరంగంగా కబ్జాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు నగరంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
ఈ వ్యవహారంపై మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటారా? లేక భూ మాఫియాల దౌర్జన్యానికి అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో తలెత్తుతున్నాయి.


