సమస్యల సాధనలో పీఆర్‌టీయూ ముందుంటుంది
ఉద్యోగులు–ఉపాధ్యాయుల హక్కులకై నిరంతర పోరాటం
సంఘం మండల అధ్యక్షుడు కొత్త నరసింహారెడ్డి
నెల్లికుదురులో పీఆర్‌టీయూ టీఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ
కాకతీయ, నెల్లికుదురు : ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల సాధనలో పీఆర్‌టీయూ టీఎస్ ఎప్పుడూ ముందుంటుందని పీఆర్‌టీయూ టీఎస్ మండల అధ్యక్షులు కొత్త నరసింహారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నెల్లికుదురులో ఎంఈఓ రాందాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని పీఆర్‌టీయూ టీఎస్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొత్త నరసింహారెడ్డి మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేరాలని, అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల సమస్యలపై పీఆర్‌టీయూ టీఎస్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ హక్కుల కోసం ఉద్యమిస్తున్నదన్నారు. రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వం కలిగిన సంఘంగా పీఆర్‌టీయూ టీఎస్ ఎదుగుతోందని తెలిపారు. సంఘ బలోపేతంతోనే సమస్యల పరిష్కారం సాధ్యమని, ఐక్యంగా పోరాడితేనే ఫలితాలు వస్తాయని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే కాలంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలపై మరింత దృఢంగా పోరాటాలు సాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు లక్ష్మణ్, రామ్‌మోహన్‌రెడ్డి, సోమయ్య, శ్రీనివాస్, జనార్ధన్, పనింద్ర, యాదగిరి, సంజీవ్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.


