ఖిల్లాపై మంచు దుప్పటి
కాకతీయ, ఖిలావరంగల్ : ఓరుగల్లు చరిత్రకు చిరునామాగా నిలిచిన కాకతీయ కళా తోరణం శీతాకాలపు మంచు గుపిట్లో మరింత మనోహరంగా దర్శనమిచ్చింది. తెల్లవారుజామున కమ్ముకున్న మంచు తెరల మధ్య నిలిచిన ఈ చారిత్రక తోరణం, కాకతీయుల శిల్పకళా వైభవాన్ని రెట్టింపు చేస్తూ చూపరులను ఆకట్టుకుంది. శతాబ్దాల చరిత్రను తన గర్భంలో దాచుకున్న ఈ తోరణం, ప్రకృతి అందాలతో కలసి అపూర్వ దృశ్యాన్ని ఆవిష్కరించింది. మంచు తాకిడితో మెరుస్తున్న రాతి శిల్పాలు, అప్పటి కాకతీయుల అద్భుతమైన కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలిచాయి. ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించిన స్థానికులు, పర్యాటకులు మంత్రముగ్ధులయ్యారు. చరిత్రకు ప్రకృతి తోడై వచ్చిన ఈ క్షణాలు, ఓరుగల్లు సాంస్కృతిక వైభవాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పినట్లయ్యాయి.


