కాకతీయ, సినిమా డెస్క్: దివంగత నటుడు కోట శ్రీనివాసరావు ఇంట్లో మరో విషాదం నెలకొంది. కోట శ్రీనివాసరావు భార్య కోట రుక్మిణి అనారోగ్య సమస్యలతో సోమవారం తెల్లవారుజామున మరణించారు. కోట శ్రీనివాసరావు ఉన్నప్పటి నుంచే ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన మరణించిన నెల రోజులకు ఆయన భార్య కూడా మరణించారు. హైదరాబాద్ లోని ఆమె స్వగ్రుహంలో మరణించారు. దీంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కోట శ్రీనివాసరావు జులై 13వ తేదీన మరణించిన సంగతి తెలిసిందే.
కొద్దిసేపటి క్రితమే ఆమె అంత్యక్రియలు హైదరాబాద్ లో పూర్తయ్యాయి. కోట శ్రీనివాసరావు, రుక్మిణి దంపతులు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. 2010లో కుమారుడు ఆంజనేయ ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అప్పటి నుంచి కోట దంపతులు ఎంతో మానసికంగా కుంగిపోయారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు ఒకరి తర్వాత ఒకరు మరణించడం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది.
కోట రుక్మిణి మరణంపట్ల పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరుగాంచిన కోట తనదైన రీతిలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విలన్ గా, కమెడియన్ గా, రాజకీయ నేతగా విభిన్న పాత్రల్లో నటించి అందర్నీ మెప్పించారు.


