రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం
రూ.35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశాలు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు పర్యటించనున్నారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని, భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) నిధులతో చేపట్టనున్న ఆలయాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఉదయం హైదరాబాద్ మాధాపూర్ నివాసం నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కొండగట్టు జేఎన్టీయూ హెలిప్యాడ్‌కు చేరుకుని, అనంతరం రోడ్డు మార్గంలో ఆలయానికి వెళ్తారు. ఉదయం 10.30 గంటలకు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం అనంతరం, టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆలయాభివృద్ధి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

రూ.35.19 కోట్లతో ఆలయాభివృద్ధి
భక్తుల సౌకర్యార్థం చేపట్టనున్న ఈ అభివృద్ధి పనుల కోసం టీటీడీ రూ.35.19 కోట్ల నిధులను కేటాయించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా కొండగట్టుకు వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఆలయాభివృద్ధి దిశగా ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి విప్ పిడుగు హరీ ప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీటీడీ బోర్డు సభ్యులు తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. శంకుస్థాపన అనంతరం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అలాగే ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన అభ్యర్థులతో ప్రత్యేక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశాన్ని కొడిమ్యాల సమీపంలోని బృందావన్ రిసార్ట్‌లో ఏర్పాటు చేశారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కొండగట్టులో భద్రతను కట్టుదిట్టం చేశారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఆలయ ఈవో శ్రీకాంత్ రావు సంబంధిత అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వెయ్యి మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఆలయ పరిసరాల్లో గట్టి భద్రతా వలయం అమలు చేస్తున్నారు. పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ జరగనుండటంతో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు వేల సంఖ్యలో తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అదనపు భద్రతా చర్యలు కొనసాగిస్తున్నారు.


