జీడబ్ల్యూఎంసీ డివిజన్లను పెంచండి
నగర విస్తరణకు అనుగుణంగా పాలనా మార్పులు జరగాలి
కాజీపేట బస్ స్టేషన్‌కు భూమి కేటాయించండి
భద్రకాళి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోండి
ముఖ్యమంత్రికి వరంగల్ ఎమ్మెల్యేల వినతి
సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల సంఖ్యను పెంచాలని వరంగల్ ప్రజాప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. వరంగల్ నగరం రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రజల అవసరాలు, నగర విస్తరణ దృష్ట్యా ప్రస్తుతం ఉన్న 66 డివిజన్లు సరిపోవడం లేదని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వివరించారు. పాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు డివిజన్ల సంఖ్య పెంపు అత్యవసరమని స్పష్టం చేస్తూ ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
కాజీపేట బస్ స్టేషన్‌కు భూకేటాయింపు చేయాలి
కాజీపేట బస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన భూకేటాయింపు ప్రక్రియను రైల్వే శాఖతో సమన్వయం చేసి వేగవంతం చేయాలని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రైల్వే అధికారులు సంబంధిత స్థలంలో సర్వే నిర్వహించారని, తదుపరి చర్యలు త్వరితగతిన చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. బస్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే కాజీపేటతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడతాయని తెలిపారు. భద్రకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. ఆలయ అభివృద్ధితో పాటు మరమరపు మాడ వీధుల నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వరంగల్ రావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
సమగ్ర అభివృద్ధికి భరోసా
వరంగల్ నగర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు భరోసా ఇచ్చారు. నగర విస్తరణకు అనుగుణంగా అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.


