తప్పులు మీవి.. కేంద్రంపై బురద జల్లుతారా..?!
అబద్దాల పోటీలు పెడితే కాంగ్రెస్–బీఆర్ఎస్‌కే అవార్డులు
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కును కేసీఆర్ తాకట్టు పెట్టారు
యూపీఏ విభజన చట్టంతోనే తెలంగాణకు అన్యాయం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కృష్ణా జలాల వాటా విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేసిన ఘోర తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘హైదరాబాద్‌లో జాతీయ అబద్దాల పోటీలు నిర్వహిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తొలి రెండు అవార్డులు ఖాయంగా దక్కుతాయి’’ అని ఎద్దేవా చేశారు. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు 555 టీఎంసీలు రావాల్సి ఉండగా, కేవలం 299 టీఎంసీలకే సరిపోతుందని కేసీఆర్ ఒప్పందం చేసుకున్నదే చరిత్రలో అతిపెద్ద ద్రోహమని బండి సంజయ్ ఆరోపించారు. 2015 జూన్ 19న జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీకి అనుకూలంగా కేసీఆర్ సంతకం చేశారని గుర్తు చేశారు. ఆ ఒప్పంద పత్రాలను ఆనాడే తానే బయటపెట్టిన విషయాన్ని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నా కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కేంద్రాన్ని తప్పుపట్టడం పూర్తిగా అవగాహనలేమి ఫలితమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గోదావరి ట్రైబ్యునల్ ప్రకారం పోలవరం ద్వారా వచ్చే 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డికి వినియోగించుకోవచ్చని కేంద్రం స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. అయితే 90 టీఎంసీల నీటి వినియోగానికి సంబంధించిన సమగ్ర వివరాలు పంపకపోవడంతోనే డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపిందని, తిరస్కరించలేదని తెలిపారు. నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపించారు.
యూపీఏ విభజన చట్టమే మూలకారణం
తెలంగాణకు మొదటి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్ర విభజన చట్టం–2014లోని సెక్షన్ 89 కారణంగా బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులను టచ్ చేయరాదని నిబంధన పెట్టి తెలంగాణను దెబ్బతీశారని విమర్శించారు. ఈ పరిమితుల వల్లే కొత్త ట్రైబ్యునల్ కూడా నీటి కేటాయింపులపై పూర్తిగా విచారణ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. యూపీఏ చేసిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు మోదీ ప్రభుత్వం 2023 అక్టోబర్ 6న కొత్త ట్రైబ్యునల్‌కు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ జారీ చేసి కృష్ణా బేసిన్ మొత్తాన్ని శాస్త్రీయంగా పునర్విభజన చేసే అవకాశాన్ని కల్పించిందని గుర్తు చేశారు. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే బదులు రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా టెక్నికల్, లీగల్ వాదనలు వినిపించకుండా రాజకీయ ఆరోపణలకే పరిమితమవడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఇకనైనా నీటి కేటాయింపులు, డీపీఆర్ రూపకల్పనలో చేసిన తప్పిదాలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అంగీకరించి తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అసెంబ్లీని దూషణలకు వేదికగా మార్చకుండా తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను సాధించేందుకు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.


