టైనీ టాట్స్లో ముందస్తు సంక్రాంతి
పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించిన వేడుకలు
ప్రత్యేక ఆకర్షణగా బసవన్న విన్యాసాలు
కాకతీయ, కరీంనగర్ : సంక్రాంతి పండుగను పల్లె వాతావరణాన్ని తలపించేలా అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో సంక్రాంతి అత్యంత విశిష్టమైన పండుగగా వైభవంగా జరుపుకుంటారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ నరేందర్ రెడ్డి, వేడుకల ప్రారంభానికి ముందు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ మహావిష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సంక్రాంతి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన పండుగగా భావిస్తారని, పల్లె సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
పల్లె సంస్కృతికి ప్రతిబింబం
వేడుకల్లో ఆకర్షణీయమైన ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల (బసవన్న) విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భోగి, మకర సంక్రాంతి, కనుమగా మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండుగలో కొత్త ధాన్యాలతో వంటలు చేయడం ఆనవాయితీని ఆయన వివరించారు. చెడుపై మంచి గెలుపుకు సంకేతంగానే సంక్రాంతిని భావిస్తారని తెలిపారు. ప్రకృతి, పంటలు, కుటుంబ బంధాలు, సంస్కృతి–సాంప్రదాయాలకు సంక్రాంతి ప్రతీక అని డాక్టర్ నరేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ దుస్తుల్లో వారి సందడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘డూ… డూ…’ అంటూ బసవన్న చేసిన విన్యాసాలు చిన్నారులను, పెద్దలను మంత్రముగ్ధులను చేశాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


